జగన్‌ ఆరాచక పాలనకు సమాధి కట్టండి

Mar 29,2024 21:59
ఫొటో : చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలుకుతున్న టిడిపి నేతలు

ఫొటో : చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలుకుతున్న టిడిపి నేతలు
జగన్‌ ఆరాచక పాలనకు సమాధి కట్టండి
– ప్రజాగళం రోడ్‌షోలో నారా చంద్రబాబునాయుడు
ప్రజాశక్తి-కావలి : ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి రక్షణ ఇవ్వలేని జగన్‌ మోహన్‌రెడ్డి నియంత్రత్వ, నిరంకుశ, ఆరాచక పరిపాలనకు సమాధి కట్టాలని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కావలి ఎ.ఎం.బేకరీ సెంటర్‌లో జరిగిన ” ప్రజాగళం ” రోడ్‌ షో సందర్భంగా అయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జగన్‌ 5యేళ్ళ పరిపాలనలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జీతాలు సక్రమంగా ఇవ్వలేదని తెలిపారు. వాళ్లకు పి.ఆర్‌.సి., ప్రావిడెంట్‌ ఫండ్‌, వంటివి అందుతున్నాయా అని ప్రశ్నించారు. లేదు అని ప్రజల సమాధానం విని, అందుకే వారికీ గుర్తు చేయడానికి, వారి తరుఫున పోరాడడానికి ముందుకొచ్చానని అన్నారు. తాను 45 యేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, కానీ జగన్‌ లాంటి సి.ఎం.ను ఎక్కడా చూడలేదన్నారు. ఆయనకు రాజ్యాంగంపైన కానీ, రాజ్యాంగ వ్యవస్థలపై కానీ నమ్మకం, విశ్వాసం లేవన్నారు. తనకు గిట్టక పోతే అయన పే.టి.ఎం. బ్యాచ్‌లతో రెచ్చగొట్టడం, అదేమంటే దాడి చేయించడం, పోలీస్‌ రిపోర్ట్‌ ఇప్పించి, కేసులు పెట్టడం, జైళ్ల పాలు చేయడం, అదీ చాలకపోతే సి.బి.ఐ., సి.ఐ.డి.లను పంపడం, నానా ఇబ్బందులు పెట్టడం, కక్ష సాధిచడం, అదీ చాలకపోతే చంపించడం ఆయన నైజమన్నారు. సొంత బాబాయిని గొడ్డలితో చంపించి, సొంత చెల్లెళ్లను కించపరుస్తూ, వాళ్లపై తప్పుడు కేసులు పెట్టించిన వ్యక్తి అని అన్నారు. పేదల కడుపు నింపాలని రూ.5లకే అన్నం పెట్టే ” అన్న క్యాంటీన్‌”లను టిడిపి పెడితే, పేదల ఓట్లతో తాను గెలిచి నిర్థాక్షిణ్యంగా అన్న క్యాంటీన్‌లను ముసివేసిన జగన్‌ పెత్తం దారా? కాదా.. అని ప్రశ్నించారు. తాము గెలిస్తే, అన్ని వర్గాల ఆదాయాలు పెంచి, ఖర్చులు తగ్గించి, జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. ఆడబిడ్డ నిధి కింద కుటుంబంలోని ఒక్కో ఆడపిల్లకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్నారు. తల్లికి వందనం పథకం కింద తల్లికి నెలకు రూ.1500 అందజేస్తామన్నారు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు. అన్నదాత పథకం కింద రైతుకు సాలుకు రూ.20 వేలు ఇస్తామన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధరలు, సబ్సిడీలు అందజేస్తామన్నారు. 5యేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబ్‌ క్యాలెండరు ప్రకటిస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయిస్తామన్నారు. ఫ్యామిలీ పెన్షన్లను రూ.3 వేల నుండి రూ.4వేలకు పెంచుతామన్నారు. కార్యక్రమం లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఎంపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డిని, అసెంబ్లీ అభ్యర్థి దగ్గుమాటి (కావ్య) క్రిష్ణారెడ్డిలను పరిచయం చేస్తూ, కావలి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు దృష్టికి తెచ్చారు.

➡️