చోరీ కేసులో ఇద్దరు అరెస్టు

నగరంలోని బొంత వారి వీధిలో

మాట్లాడుతున్న డిఎస్‌పి శృతి

  • 25 తులాల బంగారం స్వాధీనం

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

నగరంలోని బొంత వారి వీధిలో మార్చి 2న ఇంట్లో జొరబడి చోరీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకుని అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి 25 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని శ్రీకాకుళం డిఎస్‌పి శృతి తెలిపారు. నగరంలోని డిఎస్‌పి కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బొంతవారి వీధిలో భమిడిపాటి జగదాంబ, ఆమె కుమారుడు శ్రీనివాస్‌లు నివాసం ఉంటున్నారని అన్నారు. మార్చి 2న ఉదయం 9 గంటల సమయంలో తన కొడుకు శ్రీనివాస్‌ విధులకు హాజరయ్యేందుకు వెళ్లాడు. జగదాంబ ఒక్కరే ఇంట్లో ఉండగా ఉదయం 11.15 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి శివాలయం పూజారి పంపించారని నమ్మబలికి ఇంట్లోకి ప్రవేశించారని అన్నారు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కట్టేశారని చెప్పారు. కేకలు వేస్తే చంపుతామని బెదిరించి ఆమె వద్ద ఉన్న 16 బంగారు గాజులు , 3 పేకల బంగారు గొలుసులు, ఇతర వస్తువులు తీసుకుని పరారయ్యారని అన్నారు. అదే రోజు బాధితురాలు జగదాంబ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు. ఆ పరిసరాల్లో ఉన్న వెబ్‌ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన చల్లా జంపన్న, ఎఎస్‌ఆర్‌ జిల్లా ఏటి కొప్పాక మండలం సీతారాంపురానికి చెందిన పొదుటూరి సాంబశివరావులే ఈ చోరికి పాల్పడినట్టు గుర్తించామని అన్నారు. రూరల్‌ సిఐ సన్యాసినాయుడు, వన్‌టౌన్‌ ఎస్‌ఐ బి.గణేష్‌లు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టామని తెలిపారు. ఎట్టకేలకు ఆదివారం నగరంలోని కోటేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో సంచరిస్తున్న వీరిద్దరినీ పట్టుకున్నట్టు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులిద్దరు ఇటీవల శ్రీకాకుళం నగరానికి వచ్చిన సమయంలో ఆటోలో ప్రయాణించారు. అదే ఆటోలో ఉన్న జగదాంబతో మాటలు కలిపారన్నారు. ఆమె నివాస ముంటున్న ఇంటితో పాటు అన్ని విషయాలు ఆమెతో మాటలు కలిపి తెలుసుకున్నారని తెలిపారు. వీరు ఒంటరిగా నివాస ముంటున్న సమయం తెలుసుకుని చోరీకి పాల్పడినట్టు డిఎస్‌పి వివరించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. కేసును ఛేదించిన సిఐ, ఎస్‌ఐ, సిబ్బందిని అభినందించారు.

➡️