చైతన్య ఝురి.. రాజమహేంద్రి ఎంపీ బరి..

Mar 24,2024 22:49
చైతన్య ఝురి.. రాజమహేంద్రి ఎంపీ బరి..

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి రాష్ట్రంలో కవులకు, కళాకారులకు పుట్టినిల్లు, సాంస్కృతిక కళా రాజధానిగా పేరుగాంచిన రాజమహేంద్రి పార్లమెంట్‌ స్థానానికి ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్ర ఉద్యమంతో పాటు సాంఘిక ఉద్యమాలకు ఈ ప్రాతం కేంద్ర బిందువుగా చరిత్రలో చెరగని ముద్ర ఉంది. అటువంటి ప్రత్యేకత కలిగిన ఈ ప్రాంతంలో తాజాగా 18వసారి జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో అనే మీమాంశ రాజకీయ పార్టీలను వెంటాడుతోంది. 2014లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన గత పదేళ్లలో రాష్ట్రాలు, స్థానిక సంస్థల హక్కులను దూరం చేసిన విషయం విదితమే. 2014 రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం నిర్మాణానికి నిధులు వంటివి మేడిపండు చందంగా మారాయి. అటువంటి బిజెపి విధానాలకు అధికార వైసిపి, విపక్ష టిడిపి పార్లమెంటు సభ్యులు ప్రశ్నించిన దాఖలాలు లేవు. బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లులకు పోటీపడి మద్దతు తెలపటం ఓటర్లను ఆలోచింపజేస్తోంది. 2009లో బిజెపి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన సోము వీర్రాజుకు కనీస డిపాజిట్లు దక్కలేదు. ప్రత్యర్ధి ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు 3,57,449 ఓట్లు రాగా సోము వీర్రాజుకు కేవలం 7,123 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2004లో బిజెపి అభ్యర్థి కంటిపూడి సూర్యనారాయణపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ 1,39000 పైగా మెజారిటీతో గెలుపొందారు. అటువంటి బిజెపి టిడిపి, జనసేనతో పొత్తు నేపథ్యంలో మరోసారి బరిలో దిగేందుకు సిద్ధమయింది. 18వ సారి జరిగే ఈ ఎన్నికలలో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.తొలి గెలుపు కమ్యూనిస్టులదేరాజమహేంద్రి పార్లమెంటు స్థానంలో చైతన్యవంతమైన ఓట్లు ఉన్నారు. స్వాతంత్య్ర సమరయోధులతో పాటు కళాకారులను సైతం ఈ ప్రాంత ప్రజలు ఆదరించి పార్లమెంటు సభ్యునిగా విజయం అందించారు. స్వాతంత్య్రానంతరం తొలి గెలుపు కమ్యూనిస్టులదే. 1952లో జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. కానేటి మోహనరావు, నల్లా రెడ్డినాయుడు తొలి పార్లమెంటు సభ్యులుగా ప్రజలకు సేవలందించారు. అనంతరం 1957 నుంచి 1984 వరకూ వరుసగా జరిగిన ఆరు ఎన్నికలలోనూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులు గెలుపొందారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దాట్ల సత్యనారాయణ రాజు మూడుసార్లు ఎన్నికకాగా అనంతరం ఎస్‌బిపి పట్టాభిరామారావు మూడుసార్లు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనంతరం 1984లో ఆ పార్టీ నుంచి చుండ్రు శ్రీహరిరావు ఎన్నికయ్యారు.1989లో ప్రముఖ సినీ నటి జూలూరి జమున పార్లమెంటుసభ్యులుగా ఇక్కడి నుంచే ఎన్నికయ్యారు. 1991లో టిడిపి అభ్యర్థి కెవిఆర్‌ చౌదరి గెలుపొందారు. 1998లో బిజెపి అభ్యర్థి గిరజాల వెంకటస్వామి నాయుడు 1999లో ఎస్‌బిపిబికె సత్యనారాయణరావు గెలుపొందారు. 2004, 2009లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి, ప్రముఖ సినీ నటుడు మాగంటి మురళీమోహన్‌ గెలుపొందారు. గెలుపొందిన అనంతరం ప్రజలకు అందుబాటులో లేరనే విమర్శలను ఎదుర్కొన్నారు. 2019లో ప్రతిపక్ష నేతగా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన పాదయాత్ర ఫలితంగా వైసిపి అభ్యర్ధి మార్గాని భరత్‌ రామ్‌ గెలుపొందారు. ఆ పార్టీ విప్‌గా పార్లమెంటు సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించి తాజాగా రాజమండ్రి అసెంబ్లీ బరిలో పోటీకి సిద్ధమయ్యారు.18వ పార్లమెంటు సభ్యులు ఎవరు..?స్వాతంత్య్రానంతరం 18వ సారి జరిగే ఈ ఎన్నిల్లో ప్రజాతీర్పు ఎలా ఉండబోతోందోననే సందేహం రాజకీయ పార్టీలను వెంటాడుతోంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ వైద్యులు గూడూరి శ్రీనివాస్‌ బరిలో నిలిచారు. టిడిపి, జనసేన, బిజెపి పొత్తు నేపథ్యంలో ఈ స్థానంలో బిజెపి అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. తొలుత ఈ స్థానం నుంచి వైసిపి తరుపున ప్రముఖ సినీ దర్శకులు వివి.వినాయక్‌, నటులు సుమన్‌, స్థానిక నేతలు పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ ఊహగానాలకు వైసిపి అధినేత తెరదించి అభ్యర్థిని ప్రకటదించారు. తెలుగుదేశం పార్టీ తరుపున బొడ్డు వెంకటరమణ చౌదరి, శిష్ట్లా లోహిత్‌లతో పాటు పలువురు స్థానిక నేతల పేర్లు వినిపించాయి. పొత్తు నేపథ్యంలో బిజెపికి కేటాయించినట్లు తెలుస్తోంది. బిజెపి చివరిసారిగా పోటీ చేసిన 2009లో కనీస డిపాజిట్లు దక్కకపోవటంతో ఆ పార్టీ అభ్యర్థి అంటూ ప్రచారం జరుగుతున్న మాజీ మంత్రి పురందేశ్వరి తొలుత వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. అయితే పార్టీ అభ్యర్థిగా ఆమె పోటీకి దిగడం ఆసక్తి రేపుతోంది. ఈ పార్లమెంట్‌ స్థానం పరిధిలో అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌తోపాటు కొవ్వూరు గోపాలపురం, నిడదవోలు నియోజక వర్గాల్లో మొత్తం 16,05,752 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 7,85,142 మంది కాగా, మహిళా ఓటర్లు 8,20,515 మంది, ట్రాన్స్‌జెండర్స్‌ 105 మంది ఓటర్లు ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలో 2,71,159 మంది ఓటర్లు నమోదు కావడంతో జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గంగా నిలిచింది. కొవ్వూరు నియోజకవర్గం కేవలం 1,83,405 ఓటర్ల నమోదు అత్యల్ప నియోజకవర్గంగా నిలిచింది. తాజాగా జరిగే ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

➡️