చేప చిక్కినా.. సొమ్ము దక్కదు

జిల్లాలో ఎక్కువ మంది మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న జిల్లాలో చేపల వేట రోజురోజుకూ
  • మత్య్సకారులకు తప్పని తిప్పలు
  • కోల్డ్‌ స్టోరేజీలు, జెట్టీలు లేక అవస్థలు

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో ఎక్కువ మంది మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న జిల్లాలో చేపల వేట రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. సౌకర్యాల్లేక, ప్రభుత్వాల నుంచి తోడ్పాటు అందక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగించాల్సిన దయనీయ పరిస్థితి. జిల్లాకు చెందిన సీదిరి అప్పలరాజు మత్స్యశాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నా, మత్స్యకారుల కష్టాలు మాత్రం తీరడం లేదు. జెట్టీలు, హార్బర్లు నిర్మిస్తామని పాలకులు చెప్పడమే తప్ప నేటికీ కార్యరూపం దాల్చకపోవడంతో వలస జీవనం తప్పడం లేదు. జిల్లాలో 11 తీర ప్రాంత మండలాల్లో మత్య్సకారులు జీవనం సాగిస్తున్నారు. 193 కిలోమీటర్ల పొడవున జిల్లాలో విస్తరించి ఉన్న తీరంలో వేలాది కుటుంబాలు చేపల వేటే జీవనాధారంగా ఉన్నాయి. సముద్రంలో వేట సాగించడం, దొరికిన చేపలను ఒడ్డుకు చేర్చి వాటిని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోకి తరలించి విక్రయించడం రోజువారీ జీవన విధానంగా మారింది. చేతికి అందిన చేపలను నిల్వ చేసుకునే సామర్థ్యం గల కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యం జిల్లాలో లేకపోవడంతో ఏరోజుకారోజు చేపలు అమ్మాల్సిన దుస్థితి ఉంది. ఇతర ప్రాంతాలనుంచి వ్యాపారులు వచ్చినా చేసేది లేక తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని మత్య్సకారులు వాపోతున్నారు.జిల్లాలో గతంలో భావనపాడు వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం జరిగినా అది వినియోగంలోకి రాలేదు. తరచూ ఇసుక మేటల వల్ల దీన్ని వృథాగానే వదిలేశారు. ఇది తప్ప మరెక్కడా ఒక్క నిర్మాణం జరగలేదు. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు, ఎచ్చెర్ల మండలం కుప్పిలి ప్రాంతాల్లో జెట్టీలను నిర్మిస్తామన్న ప్రభుత్వాలు నేటికి వాటిని చేపట్టలేదు. మరోవైపు తీరంలో కోల్డ్‌ స్టోరేజీలు, ఫ్లాట్‌ఫారాల్లేక దొరికిన చేపలను ఎప్పటికప్పుడు మార్కెట్‌కు తరలించాల్సి వస్తోంది. దీనవల్ల సరైన ధర లేక రాత్రింబవళ్లు శ్రమిస్తున్నా ఫలితం దక్కడం లేదు. దీనికితోడు విపత్తుల సమయంలో స్థానికులకు రక్షణగా నిలిచే భవనాలు చాలాచోట్ల శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకట్రెండు తప్ప మిగిలినవన్నీ కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొత్త భవనాలు నిర్మిస్తామని, ఆందోళన వద్దని ప్రభుత్వం హామీ ఇచ్చినా, నీటిమూటగానే మిగిలిపోయింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపలు సమృద్ధిగా చిక్కుతున్నా మార్కెటింగ్‌ సదుపాయం వేధిస్తోంది. స్థానికంగానూ క్రయవిక్రయాలకు ఎలాంటి వసతుల్లేవు. దూర ప్రాంతాలకు తరలిం చేందుకు రవాణా సదుపాయమూ కొరవడుతోంది. జిల్లాలో ఏటా 1.78లక్షల మెట్రిక్‌ టన్నుల చేపలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. వేలాదిగా ఉన్న మత్య్సకార కుటుంబాల్లో వందల మందికి మాత్రమే లబ్ధి చేకూరుతోంది. వనరులు లేకపోవడం, ఆదాయ మార్గాలు సన్న గిల్లడంతో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఏటా 15 వేల మంది వరకు గుజరాత్‌, ఒడిశా, చెన్నై తదితర ప్రాంతాలకు పయనమవుతున్నారు. వలసల నివారణకు మాత్రం చర్యలు కనిపించడం లేదు.

మత్స్యకారుల అభివృద్ధికి చర్యలు

మత్స్యకారుల అభివృద్ధిపై దృష్టిసారించాం. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. జెట్టీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయడమైంది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి.

– శ్రీనివాసరావు, డీడీ, మత్స్య శాఖ

➡️