చెరువు ఆక్రమణ

Feb 1,2024 20:34

ప్రజాశక్తి – గరుగుబిల్లి : మండలంలోని కొత్తూరు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌ 143లో పదిఎకరాల 42 సెంట్లు విస్తీర్ణంలో ఉన్న సీరాపువాని చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుపోయింది. చెరువు సగం ఆక్రమణలకు గురికావడంతో రూపాన్ని కోల్పోయింది. ఈ చెరువే ఆధారంగా కొత్తూరు, కొత్తపల్లి గ్రామాలకు చెందిన సుమారు 100 ఎకరాలకు సాగునీరందేది. ప్రస్తుతం చెరువు సగం ఆక్రమణకు గురికావడంతో సాగునీరందక ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చెరువు ఆక్రమణలపై రైతులు ఎన్నిసార్లు తమ గోడును అధికారులకు తెలియజేసినా ఫలితం సున్నా పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పెత్తందారులు చిన్న, సన్నకారు రైతులను తమ పరిసరాల్లో లేకుండా చేసేందుకు చెరువులను కబ్జా చేసి వ్యవసాయదారులకు నీరందకుండా చేయాలని ఉద్దేశంతో రాజకీయ, అధికార జులం కలగలిపి చెరువును ఆక్రమించేంలా కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులకు చెరువు కబ్జాయిన విషయం తెలిసినప్పటికీ, వాస్తవానికి ఈ చెరువు విస్తీర్ణం పదెకరాల42 సెంట్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఐదు ఎకరాలు తగ్గిపోయింది. ఈ విషయం తెలిసినా అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.అడిగే నాథుడే లేడు…!మండలంలో చెరువుల ఆక్రమణ యథేచ్ఛగా సాగుతున్న విషయం అధికారులకు తెలిసినా ఎవరూ నోరు మెదపడం లేదు. దీంతో అమాయక జనంపై అజమాయిషీ చలాయించడం తప్ప సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై వెనుక భారీ మొత్తంలో ముడుపులు చేరుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్చరిక బోర్డు తొలగింపుచెరువు ఆక్రమణలపై అధికారులు గతంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును ఆక్రమణదారుల తొలిగించినట్లు ఆయకట్టు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్చరిక బోర్డు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమైనట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలి…. జిల్లాలో చెరువుల ఆక్రమణలు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అండదండలతోనే జరుగుతున్నాయి. ఎందుకంటే కళ్ల ముందు కబ్జాలు జరుగుతున్నా చెరువుల్లో పెద్దపెద్ద భవనాలు నిర్మిస్తున్నా కనీసం ఆయా శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అడ్డుకోవడం లేదు. చెరువుల్లో దొంగ పట్టాలు రాజ్యమేలుతున్నప్పటికీ రెవెన్యూ శాఖ కనీసం స్పందించడం లేదు. ఈ విషయమై పలుమార్లు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు శూన్యం. చెరువుల కబ్జా వెనుక కింద స్థాయి నుండి పై స్థాయి అధికారుల వరకు కబ్జాదారులకు అండదండలున్నాయి. వంగల దాలి నాయుడు,జిల్లా అధ్యక్షులు,ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి.నివేదిక అందజేసేందుకు యత్నంకొంత మంది వ్యక్తులు చేసిన ఫిర్యాదు మేరకు చెరువులను పరిశీలించి ఆక్రమణ, విచారణ జరిపించి, ఎంత విస్తీర్ణం ఆక్రమణలో ఉన్నదని గుర్తించేందు సిబ్బందింతో నిర్దారణ జరిపి నివేదికను సంబంధిత అధికారులకు సమర్పిస్తాం.డిటిపిఎస్‌ఎల్‌ కుమార్‌,డిప్యూటీ తహశీల్దార్‌.

➡️