చంద్రబాబుతో పికె భేటీ

అమరావతికొచ్చి భేటీ అయిన పికె

– ఇటీవలి వరకు వైసిపికి ఎన్నికల వ్యూహకర్త ఆయనే

– దాంతో అధికార పార్టీలో గుబులు

– పికె, లోకేశ్‌ ప్రయాణానికి బిజెపి ఎంపి విమానం!

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ (పికె) శనివారం అమరావతికొచ్చి ప్రత్యేకంగా భేటీ కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఇటీవలి వరకు పికె అధికార వైసిపికి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. అటువంటి వ్యక్తి హఠాత్తుగా చంద్రబాబుతో సమావేశమై గంటల కొలది చర్చించడంపై సర్వత్రా ఆసక్తిగా మారింది. వైపిపిలో గుబులు పుట్టిస్తోంది. పికె, చంద్రబాబు ఇద్దరి మధ్య ఏ అంశాలు చర్చకొచ్చాయనే దానిపై ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. పికె పూర్తిగానే వైసిపికి దూరమయ్యారా లేదంటే కేవలం కొన్ని సలహాలివ్వడానికే బాబును కలిశారా అనే విషయంపై స్పష్టత లేదు. నారా లోకేష్‌తో కలిసి ప్రత్యేక విమానంలో పికె శనివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి ఇద్దరూ కలిసి ఉండవల్లిలోని బాబు నివాసానికి వెళ్లారు. అక్కడ బాబు, పికె, లోకేష్‌ మధ్య సుదీర్ఘ మంతనాలు సాగాయని తెలుస్తోంది. ఇప్పటికే పికె రానున్న ఎన్నికలపై తాను తయారు చేసిన సమగ్ర నివేదికను బాబుకు అందజేశారని సమాచారం. ఎత్తుగడలపై వ్యూహ రచనచంద్రబాబు అరెస్ట్‌, లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ, జనసేన, టిడిపి మధ్య ఎన్నికల పొత్తులపై చర్చలు సాగుతున్న తరుణంలో పికె టిడిపి శిబిరానికి దగ్గర కావడం గమనార్హం. సాధారణంగా పికె మార్క్‌ రాజకీయం మన రాష్ట్రం సహా దేశానికి, పలు రాష్ట్రాలకు సుపరిచితమే. సోషల్‌ ఇంజనీరింగ్‌, సంక్షేమ పథకాలు, తరగతులవారీగా జనం నాడి పట్టుకోవడం, ప్రత్యర్థి పార్టీలపై భావజాలపరంగా ఆధిపత్యం సాధించడం పికె వ్యూహాల్లో ప్రధానంగా ఉంటాయని చెబుతారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌పై దాడి, వివేకా హత్య, సినిమా హీరో శివాజీ గరుడ పురాణం, డేటా చోరీ, తదితరాల వెనుక పికె సూచనలున్నాయని గతంలో టిడిపి విమర్శించింది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో ముందు నుంచే పికె వైసిపికి పని చేశారు. జగన్‌ పాదయాత్ర, మ్యానిఫెస్టో తయారీ, ఎన్నికల హామీలు, రోజువారీగా ప్రతిపక్షాలపై విమర్శలు పికె టీమే జగన్‌కు, వైసిపికి తయారు చేసి ఇచ్చేదని, చివరికి అభ్యర్ధుల ఎంపిక, గెలుపు ఓటములపై పీరియాడికల్‌ సర్వేలు చేసి ఎప్పటికప్పుడు వైసిపికి చేరవేసింది. కాగా పికె కొన్నాళ్లుగా వైసిపికి దూరమయ్యారని, పికె నుంచి విడిపోయిన ఐ-ప్యాక్‌ అనే మరో కన్సెల్టెన్సీ ప్రస్తుతం వైసిపికి పని చేస్తోందని, ఆ సంస్థ సూచనల మేరకే చాలా చోట్ల ప్రస్తుతం జగన్‌ అభ్యర్ధులను మార్పు చేస్తున్నారని చెబుతున్నారు. కాగా ఇప్పటికీ వైసిపికి కీలక సర్వేలు పికె కనుసన్నల్లోనే జరుగుతున్నాయని సమాచారం. బిజెపి ఎంపి ఫ్లయిట్‌…అమరావతికి వచ్చిన పికె, లోకేష్‌లు ప్రయాణించిన విమానం బిజెపికి చెందిన ఒక ఎంపికి చెందినదని, లేదంటే ఆ నేతే వీరికి విమానాన్ని సమకూర్చారని చర్చ జరుగుతోంది. కాగా ఎపి ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెబుతున్నాయి. అయితే ఎన్‌డిఎలో ఉన్న జనసేన, బిజెపి అనుమతి తీసుకునే టిడిపితో జత కట్టిందా అనే విషయంపై మాత్రం టిడిపి, బిజెపి, జనసేన స్పష్టత ఇవ్వట్లేదు. బిజెపి ఆశీస్సులు తమ కలయికకు తప్పకుండా ఉంటాయని మాత్రమే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చెబుతున్నారు. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో జనసేన, బిజెపి కలిసి పోటీ చేసి భంగపడ్డాయి. టిడిపి ఎన్నికలకు దూరంగా ఉంది. ఇక్కడి పరిస్థితేంటో మూడు పార్టీలూ చెప్పట్లేదు. ఈ తరుణంలో పికెను చంద్రబాబుతో కలిపించేందుకు బిజెపి ఎంపి విమానం ఏర్పాటు చేయడం గమనార్హం. తెలంగాణలో బోల్తా ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పికె టీం బిఆర్‌ఎస్‌కు ఎన్నికల వ్యూహకర్తలుగా పని చేసినా ఓటమి మూటగట్టుకుంది. ఇప్పుడే టిడిపి పికెను సలహాదారుగా ఎంపిక చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే టిడిపికి షోటైం కన్సెల్టెన్సీ సంస్థ అధినేత రాబిన్‌ శర్మ వ్యూహకర్తగా పని చేస్తున్నారు. ఆయన బృందం కూడా బాబు, పికె మధ్య జరిగిన చర్చల్లో పాల్గన్నట్లు సమాచారం. పికె 2011 నుంచి వివిధ రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పని చేశారు. తొలుత మోడీకి గుజరాత్‌లో 2012లో మూడవ తడవ సిఎం కావడం కోసం పని చేశారు. ఆ తర్వాత బిజెపికి 2014 సార్వత్రిక ఎన్నికల్లో పని చేశారు. జెడిఎస్‌, టిఎంసి, కాంగ్రెస్‌, ఆప్‌, డిఎంకె, వైసిపిలకు పని చేశారు. సక్సెస్‌లతోపాటు ఫెయిల్యూర్స్‌ కూడా ఉన్నాయి. యుపిలో కాంగ్రెస్‌, తమిళనాడులో ముందటి ఎన్నికల్లో డిఎంకె, మొన్న తెలంగాణలో బిఆర్‌ఎస్‌లు పికె సూచనలిచ్చినా ఓడిపోయాయి.

➡️