ఘనంగా పోలమాంబ అనుపోత్సవం

Jan 24,2024 21:49

ప్రజాశక్తి – మక్కువ : శంబర పోలమాంబ అమ్మవారి మొదటివారం జాతరకు సంబంధించి ప్రక్రియ బుధవారంతో పూర్తయింది. పోలమాంబ అమ్మవారి అనుపోత్సవాన్ని ఇఒ వివి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. చదురుబడి నుండి అమ్మవారిని వనం గుడిలోకి ప్రవేశపెట్టడంతో మొదటివారం ఉత్సవం ముగిసింది. అమ్మవారిని బుధవారం ఉదయం మేళతాళాల నడుమ చదురు గుడి నుండి సావిడ వీధికి తీసుకొచ్చారు. అక్కడ పూర్వా ఆచారం ప్రకారం ఉయ్యాల కంబాల కార్యక్రమం పూర్తయిన వెంటనే భామాకలాపం అమ్మవారి ముందు ప్రదర్శిస్తూ వనంగుడి వైపు అమ్మవారిని ఘటాలతో నడిపిస్తారు. ఈ సందర్భంగా చాలామంది చిన్నపిల్లలను అమ్మవారి పాదాలకు తగిలేలా నేలపై పడుకోబెట్టి ఆశీర్వాదాలు పొందుతారు. అనంతరం గోముఖి నది దాటిన వెంటనే వనంగుడి వైపు పోలమాంబ అమ్మవారు పరుగు తీస్తారు. పెద్ద ఎత్తున అమ్మవారి వెంట ప్రజలు పరుగులు తీస్తూ వనంగుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. సాంప్రదాయ ప్రకారం అమ్మవారికి బలినార్పించి వనంగుడిలో ప్రవేశపెడతారు. దీంతో మరుసటి ఏడాది వరకు అమ్మవారిని భక్తులు వనంగుడి వద్ద మొక్కులు తీర్చుకుంటారు.30న మారు జాతరఈనెల 30 మంగళవారం వనం గుడి వద్ద మారుజాతర జరగనుంది. అలాగే మిగిలిన వారాల జాతర కూడా ఇక్కడే నిర్వహిస్తారు. అధిక సంఖ్యలో వనంగుడి వద్దకు భక్తులు పాల్గొని పూజలు చేస్తారు. 10 వారాల జాతర అనంతరం మహా చండీ హౌమం చేపట్టి అన్నదాన కార్యక్రమంతో ఈ ఏడాది జాతరకు దేవాదాయ శాఖ ముగింపు పలకనుంది.వేలం పాటలు, టికెట్లు ద్వారా ఆదాయం రూ 21, 11 లక్షలుశంబర పోలమాంబ అమ్మవారి జాతర సందర్భంగా దర్శించుకున్న భక్తులు 20 రూపాయ 100 రూపాయల టికెట్లు ద్వారాలు, అలాగే తలనీలాలు, కేశఖండన, కొబ్బరి చిప్పలు, ఇతర దీపాలు. ఫోటోలు వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని దేవాదాయ శాఖ ఇఒ వివి సూర్యనారాయణ బుధవారం వెల్లడించారు. రూ.21లక్షల 11,811 వేల ఎనిమిది వందల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. గత ఏడాది కంటే ఈ విభాగాల్లో సుమారుగా రెండు లక్షల పైబడి అధిక ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇదిలా ఉండగా దేవాదాయ శాఖ ఈ జాతరకు టికెట్‌ ధరలను గతం కంటే 100శాతం పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మొదటి జాతరకు ఆశించిన స్థాయిలో భక్తులు రాకపోవడం, అలాగే ధరలు అధికంగా ఉండడంతో ఎక్కువ మంది భక్తులు ఉచిత దర్శనం క్యూ కట్టడం జరిగింది. దీంతో దేవాదాయ అధికారులు ఇచ్చిన వివరాలు ప్రకారం గత ఏడాదిని పోల్చి చూస్తే ఏడాది శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనం టికెట్లకు సుమారు 93,000 వరకు మాత్రమే ఆదాయం పెరిగింది. అలాగే కేశఖండనకు సంబంధించి దాదాపుగా సగానికి ఆదాయం తగ్గింది.

➡️