గ్రామం, పట్టణం.. నిరసన గళం..

Feb 16,2024 23:56

గుంటూరులో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు
ప్రజాశక్తి – గుంటూరు, నరసరావుపేట : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం చేపట్టిన గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మె గుంటూరు, పల్నాడు జిల్లాల్లో జయప్రదమైంది. గుంటూరు నగరంలో కార్మిక సంఘాలు, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక శంకర్‌ విలాస్‌ సెంటర్‌ నుండి లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వరకూ నిర్వహించిన ఈ ర్యాలీలో వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మున్సిపల్‌ కార్యాలయం నుండి ఆర్‌డిఒ కార్యాలయం మీదుగా మోర్‌ సెంటర్‌ వరకూ తిరిగి మున్సిపల్‌ కార్యాలయం వరకూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. గుంటూరులో ప్రదర్వన అనంతరం అంబేద్కర్‌ విగ్రహం వద్ద జరిగిన సభలో ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజరుకుమార్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు, ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.రాధాకృష్ణమూర్తి, సిఐటియు జిల్లా కార్యదర్శి వై.నేతాజి, ఎఫ్‌టియు నాయకులు యు.గనిరాజు, ఏరువాక రైతుకూలీ సంఘం నాయకులు యు.నాగేశ్వరరావు ప్రసంగించారు. ఢిల్లీలో రైతు ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దొడ్డిదారిన వ్యవసాయ నల్ల చట్టాలు అమలు చేయాలని చూస్తోందన్నారు. వ్యవసాయ రంగాన్ని, ప్రభుత్వ పరిశ్రమలను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్ట పూనుకుందని మండిపడ్డారు. రాజ్యాంగ విలువలకు, సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి, కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా 4 లేబర్‌ కోడ్‌లో తెచ్చిందని, మరోవైపు కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారని మండిపడ్డారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకూ కనీస మద్దతు ధర చట్టం చేయాలని, కేరళ తరహాలో రైతులకు రుణ ఉపశమన చట్టం చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉపాధి హామీకి బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లు కేటాయించి, ఏడాదిలో 200 రోజులు పని కల్పించాలని, రోజువారీ వేతనం రూ.600లకు పెంచాలని, ఆహార భద్రత చట్టాన్ని పటిష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును, స్మార్ట్‌ మీటర్ల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని కోరారు. భూ హక్కు చట్టం 27/23ను రద్దు చేయాలని, చుక్కల భూములు, బంజరు భూములకు పట్టాలు ఇవ్వాలని, రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా సమగ్ర పంటల బీమా పథకం ప్రవేశపెట్టాలని, సాగులో ఉన్న కౌలు రైతులకే పరిహారం, బీమా సౌకర్యాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బి.ముత్యాలరావు, ఎన్‌.బ్రహ్మయ్య, జివి.సురేష్‌, అంజిబాబు, ఎం.రవి, డెన్నిస్‌ రాయి, సాంబశివరావు, అబ్దుల్‌ సలీం, మాల్యాద్రి, అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

నరసరావుపేట ప్రదర్శనలో మాట్లాడుతున్న గుంటూరు విజరు కుమార్‌

నరసరావుపేటలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజరుకుమార్‌, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.రామారావు, ఎఐకెఎస్‌ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు రెడ్‌ బాష, కెఎన్‌పిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ మాట్లాడారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీనిచ్చిన మోడీ వాస్తవంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితిని తెచ్చారని విమర్శించారు. రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో మూడ్రోజులుగా ఆందోళన చేస్తుంటే వారిని టెర్రరిస్టుల్లా చూస్తున్నారని, ఢిల్లీలోకి రానీయకుండా బ్యారీకేడ్‌లు, రోడ్లపై మేకులతోపాటు రైతులపై లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగానికీ తెగబడుతోందని మండిపడ్డారు. ఎంత నిర్బంధం విధించినా పోరాటం ఆగదన్నారు. వ్యవసాయాన్ని, రైతులను విస్మరిస్తే బ్రిటీష్‌ కాలం నాటి కరువు పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఆ దుస్థితికి దేశాన్ని తీసుకెళ్లాలని చూస్తే ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. నిత్యావసరాల ధరలను అదుపు చేయాలని, పంటలకు మద్దతు ధరలు కల్పించాలని, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. రైతులు, ప్రజల కష్టాన్ని దోచుకుని అదాని, అంబానీలకు దోచిపెట్టే విధానాలను అమలు చేస్తున్న ప్రభుత్వాలను గద్దె దించేందుకు ప్రజలంతా ఐక్యమవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, పిడిఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఎబిఎంఎస్‌ నాయకులు అంజమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగేశ్వరరావు, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు హుస్సేన్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి షేక్‌ సిలార్‌ మసూద్‌, టి.పెద్దిరాజు, చైతన్య గ్యాస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఏడుకొండలు, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️