గోరింటాకు పెట్టుకుని.. మోకాళ్లపై నిల్చుని

రామచంద్రపురంలో గోరింటాకు పెట్టుకుంటూ అంగన్‌వాడీల నిరసన

ప్రజాశక్తి-యంత్రాంగం

డిమాండ్ల సాధన కోసం గత 33 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్‌వాడీల సమ్మె కొనసాగుతోంది. శనివారం జిల్లాలో అంగన్‌వాడీలు పలు విధాలుగా నిరసన తెలిపారు. ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అమలాపురం స్థానిక జిల్లా కలెక్టర్‌ కార్యాలయ వద్ద 24 గంటల దీక్షay శనివారం అమలాపురం ప్రాజెక్టు కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా 24 గంటల దీక్షను సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం, అంగన్‌ వాడీ జిల్లా అధ్యక్షులు బండి వెంకటలక్ష్మి, ముమ్మిడివరం సెక్టార్‌ అధ్యక్షులు కె.వెంకటలక్ష్మి దీక్షా శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు అంగన్‌వాడీ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. డిమాండ్లు పరిష్కారం జరిగే వరకూ ఈ సమ్మె కొనసాగుతుందని అన్నారు. ఇప్పటికైనా సిఎం జగన్‌ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని లేకుంటే ఉద్యమం మరింత ఉధతం చేయడానికి సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు అన్నపూర్ణ, వెంకటలక్ష్మి, హేమలత, దేవి, మంగతాయారు, అరుణ, సత్య, గౌతమి, దుర్గభవాని, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం సమ్మెలోభాగంగా అంగన్‌వాడీలు చేతులకు గోరింటాకు పెట్టుకుని నిరసన తెలియ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో రామచంద్రపురం, కె.గంగవరం మండలాల అంగనవాడీలు మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదురుగా ధర్నాలో పాల్గొన్నారు. ధర్నా లో సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరామ్‌, అంగనవాడీ జిల్లా కార్యదర్శి దుర్గమ్మ, ప్రాజెక్టు అధ్యక్షురాలు వీరలక్ష్మి, దీక్షా శిబిరంలో పాల్గొని ప్రసంగించారు. జిల్లా కార్యదర్శి నూకల బలరాం, అంగన్వాడి అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు పిలిచి జీతాలు పెంచుతాం, ఎంత పెంచుతామో చెప్పం, జూన్‌ లో పెంచుతాం అనడం ప్రభుత్వ మొండి వైఖరికి నిదర్శనం అన్నారు. సమ్మెలో అంగనవాడీ నాయకులు వాసంశెట్టి సూర్యకుమారి, కె.విజయలక్ష్మి, జి.శ్రీదేవి, జహరా, దుర్గ, వెంకటరత్నం, జి.దేవి, వీర వేణి, 2 మండలాల అంగన్‌వాడీ వర్కర్లు, సుమారు 400 మంది పాల్గొన్నారు.ముమ్మిడివరం సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గపు చర్య అని సిఐటియు జిల్లా కార్యదర్శి జి.దుర్గా ప్రసాద్‌ పేర్కొన్నారు. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అధ్యక్ష,కార్యదర్శులు జయ లక్ష్మీ, దుర్గా మల్లేశ్వరీల ఆధ్వర్యంలో జరుగుతున్న అంగన్‌వాడీ వర్కర్లు మోకాళ్ళపై నిలబడి నిరసన తెలిపారు.ఈ శిబిరాన్ని దుర్గా ప్రసాద్‌ సందర్శించి వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలు గత 33 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం దిగి రాకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు నిరసన కొనసాగుతుందన్నారు. పండగ రోజుల్లో సైతం అంగన్‌ వాడీు మరింత దృఢ సంకల్పంతో సమ్మెలో పాల్గొని డిమాండ్లను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం అంగన్‌వాడీలు 33 ఆకారంలో కూర్చుని ప్రభుత్వానికి నీరసన తెలిపారు. ఈ నిరసనలో పాల్గొన్న అంగన్‌వాడీలు తమకు గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం కావాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నిరసనలో సెక్టార్‌ లీడర్‌ ధనలక్ష్మి, జి.శ్రీదేవి, జి.మంగాయమ్మ, వి.తలుపులమ్మ, ఎన్‌.విజయ కుమారి, అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు సహాయకులు తదితరులు పాల్గొన్నారు. మండపేట స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకుండా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అంగన్‌వాడీ కేంద్రాలు తెరిచేది లేదన్నారు. వెంటనే వేతనాలు పెంచుతున్నట్లు మరో జిఒ ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలన్నారు. ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలన్నారు. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలన్నారు. వర్కర్లతో సమానంగా మినీ వర్కర్లకు వేతనాలు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, బీమా అమలు చేయాలన్నారు. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలన్నారు. ఆయిల్‌, కందిపప్పు, క్వాంటిటీ పెంచాలి. సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలన్నారు. సూపర్వైజర్‌ పోస్టులకు వయోపరిమితి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. కార్యక్రమంలో మండపేట ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడిలు పాల్గొన్నారు.

 

➡️