గృహ నిర్బంధంలో జమ్ముకాశ్మీర్‌ నేతలు

Dec 12,2023 10:27 #Article 370, #Jammu and Kashmir
  • పోరాటం కొనసాగుతుందని నేతల స్పష్టీకరణ

న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడానికి ముందే జమ్ము కాశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్బంధాన్ని తీవ్రతరం చేసింది. తీర్పుకు వ్యతిరేకంగా కాశ్మీర్‌ లోయలో ఎలాంటి నిరసనలను అనుమతించరాదన్న దాంతో జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్ర్రులు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సిపిఐ(ఎం) నాయకులు యూసఫ్‌ తరిగామితో సహా పలువురు నేతలను, రాజకీయ కార్యకర్తలను గృహనిర్బంధం గావించింది. మీడియా వారితో కూడా మాట్లాడనివ్వలేదు. వాస్తవ పరిస్థితి ఇది కాగా, తాము ఎవరినీ గృహనిర్బంధంలో ఉంచలేదని జమ్మూకాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నరు మనోజ్‌ సిన్హ ఒక ప్రకటన చేశారు. సోమవారం ఉదయం నుండి తనను గృహ నిర్బంధంలో వుంచారని మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. తన ఇంటి గేటుకు తాళం వేశారని, మీడియా వారిని తనతో మాట్లాడనివ్వలేదని చెప్పారు. న్యాయం జరుగుతుందనే ఆశతో సుప్రీం తలుపుతు తట్టాం, కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. ‘మేం విఫలమయి వుండవచ్చు, నిర్ణయం నిరాశను కలిగించవచ్చు, కానీ ఇదంతా తాత్కాలికమైన ఎదురు దెబ్బే, మాది రాజకీయ పోరాటం, చట్టపరిధుల్లోనే మా పోరాటం కొనసాగుతుంది.” అని చెప్పారు. తనను ఇంటి నుండి బయటకు వెళ్లడానికి అనుమతించలేదని సిపిఎం నేత ఎం.వై.తరిగామి అన్నారు. మీడియా వారిని కూడా రానివ్వలేదన్నారు. సుప్రీం తీర్పుపై పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్షురాలు (పిడిపి) మెహబూబా ముఫ్తి స్పందిస్తూ, దీనివల్ల మనకు కలిగే కీడు కన్నా భారతదేశ ఆలోచనకు కలిగించే నష్టమే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో తీసుకున్న చట్టవిరుద్ధమైన నిర్ణయానికి సుప్రీం ఆమోద ముద్ర వేయడమంటే భారతదేశపు ఆలోచనను సమాధి చేయడమేనని ఆమె పేర్కొన్నారు. ఆ ద్రోహమనేది వారి నుండే వచ్చింది, మన నుండి కాదని అన్నారు. 370వ అధికరణను తాత్కాలిక నిబంధన అని పేర్కొనడం ద్వారా దేశాన్ని బలహీనపరిచారు. భారత్‌లో జమ్ముకాశ్మీర్‌ విలీనం తాత్కాలికమని చెప్పిన శక్తులు బలోపేతమయ్యాయని ఆమె విమర్శించారు. హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తనను గృహ నిర్బంధంలో వుంచారని పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్‌ ప్రజలకు సంఘీభావంగా వారం రోజుల పాటు అన్ని రాజకీయ కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు పిడిపి ప్రకటించింది.

  • సంతోషంగా లేరు

ఈ తీర్పుతో జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు సంతోషంగా లేరని మాజీ కాంగ్రెస్‌ నేత గులాం నబీ అజాద్‌ వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టే మా చివరి ఆశ, ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35-ఎలు జమ్మూకాశ్మీర్‌కు సంబంధించిన చారిత్రక అంశాలు. కోర్టు నిర్ణయం మమ్మల్ని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని చెప్పారు. ఈ తీర్పు పట్ల పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు సజాద్‌ లోనె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సుప్రీం రూలింగ్‌ని ఆమోదించి, ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిందిగా జమ్ము కాశ్మీర్‌ చివరి డోగ్రా పాలకుడు మహారాజా హరిసింగ్‌ మనవడు కరణ్‌ సింగ్‌ ప్రజలను కోరారు.

➡️