గుర్తింపు కార్డు లేకుండ ఓటు వేయటానికి అనుమతించొద్దు :ఆర్డీఓ రవీందర్‌

Feb 1,2024 16:22 #Bapatla District

ప్రజాశక్తి-పర్చూరు(బాపట్ల): ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారివద్ద గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని బాపట్ల ఆర్డీఓ గంధం రవీందర్‌ అన్నారు. గుర్తింపు కార్డులు లేకుండ ఓటు వేయటానికి వచ్చేవారిని లోనికి అనుమతించవద్దన్నారు. గురువారం స్థానిక రోటరీ భవన్లో ఎన్నికల ప్రక్రియపై నియోజకవర్గ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టే ముందు అందరి సమక్షంలో మాక్‌ పోలింగ్‌ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఎన్నిక మధ్యలో ఈవిఎంలు మొరాయిస్తే ఉన్నత అధికారుల అనుమతితో మరో ఈవిఎంని ఉపయోగించవచ్చని తెలిపారు. పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు అధికారులు, అభ్యర్థులు ఎవరు వచ్చినా వారి వివరాలు విజిట్‌ పుస్తకంలో నమోదు చేయాలన్నారు. ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి యొక్క సంతకం 17ఎ అటెండెన్స్‌ రిజిష్టర్లో తప్పనిసరిగా ఉండాలన్నారు. పోలింగ్‌ స్టేషన్‌ వద్దకు వచ్చే ముందు పోలింగ్‌ సామగ్రిని పరిశీలించి, తగిన సిబ్బంది ఉన్నారా లేదా సరిచూసుకోవాలని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని సిబ్బందిని కోరారు. కార్యక్రమంలో పలువురు తహశీల్దార్‌ లు, ఎంపిడివోలు, సీఐలు, ఎస్సైలు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

➡️