గుత్తి కోటను సందర్శించిన ఘోర్పాడే వారసుడు

గుత్తి కోటలో ఉన్న ఫిరంగి వద్ద ఘోర్పాడే వారసుడు

ప్రజాశక్తి-గుత్తి

పట్టణ సమీపంలోని గుత్తి కోటను మరాఠా రాజు కాలంలో సైనికాధ్యక్షుడిగా పని చేసిన మురారి ఘోర్పాడే వారసుడు ఇంద్రజిత్‌ ఘోర్పాడే బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపకుడు సి.విజయభాస్కర్‌ స్వాగతం పలికారు. ఇందులో భాగంగా కోటలోని కట్టడాలను వీక్షించారు. అనంతరం ఇంద్రజిత్‌ ఘోర్పడే మాట్లాడుతూ 1735 నుంచి 1773 వరకూ గుత్తి కోటను మరాఠా రాజుల కాలంలో మురారి ఘోర్పడే సైనిక అధ్యక్షుడిగా పని చేశారు. దాదాపు 30 వేల సైన్యంతో ఉన్న మురారిజీ పోరాట పటిమతో, పరిపాలన దక్షకుడిగా పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. అలాంటి మహానుభావునికి వారసుడిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇప్పటికి చక్కగా ఉన్న మురారిఘోర్పాడే గద్దెను చూచి పులకించి, ఆనంద డోలికల్లో మునిగిపోయామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో గుత్తి కోట అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతామని వివరించారు. కోటలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని, వాటిని పరిరక్షించుకోవడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గుత్తి కోట చరిత్రకు సంబంధించిన పుస్తకాలను విజయభాస్కర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముంబైకి చెందిన రచయిత్రి రిటా రామమూర్తి గుప్తా, కో ఫౌండర్‌, అఖిల భారతీయ క్షత్రియ మరాఠా ఫౌండేషన్‌ ఎపి అధ్యక్షులు మరాఠా వెంకట్‌ సోమాజి, రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి,ఆంధ్రప్రదేశ్‌ మరాఠ సంఘం ప్రధానకార్యదర్శి కాలే వెంకటరామయ్య, గుత్తి కోట సంరక్షణ సమితి సభ్యులు దేవేంద్ర రాయల్‌, శివకుమార్‌, భాషా, పురావస్తు సిబ్బంది పాల్గొన్నారు.

➡️