‘గుంటూరు అభివృద్ధికి వేగంగా అడుగులు’

గుంటూరు జిల్లా ప్రతినిధి: గుంటూరు నగరాన్ని పూర్తి స్థాయిలో తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 18వ డివిజన్‌ ఎత్తురోడ్డు వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఎత్తు రోడ్డు నుంచి వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు రూ.69 లక్షలతో సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. వెస్ట్‌ ప్యారిష్‌ చర్చి నుంచి ఎత్తు రోడ్డు జంక్షన్‌ వరకు రూ.39 లక్షలతో సీసీ పేవ్‌మెంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా గుంటూరు నగరాన్ని అభివద్ధి చేస్తున్నామని తెలిపారు. చిన్న చిన్న సమస్యలను కూడా వదలకుండా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు నగరాన్ని ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. తాము ఒక క్రమపద్ధతిన అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో గుంటూరును జాతీయస్థాయిలో గొప్ప నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అభివృద్ధి, ప్రశాంతత.. ఈ రెండే లక్ష్యంగా తాము ముందుకు సాగుతామన్నారు. అనంతరం శాసనమండలి విప్‌ అప్పిరెడ్డి, కావటి శివనాగమనోహర ్‌నాయుడు మాట్లాడారు. ఎమ్మెల్యే మద్దాలి గిరి, కార్పొరేటర్‌ నిమ్మల రమణ,విడదల గోపి పాల్గొన్నారు.

➡️