గిరిజనుల అభివృద్ధికి పోలీసుశాఖ కృషి

గిరిజన యువతతో మాట్లాడుతున్న చింతపల్లి ఎఎస్‌పి శివప్రతాప్‌ కిశోర్‌

చింతపల్లి ఎఎస్‌పి శివ ప్రతాప్‌ కిశోర్‌

ప్రజాశక్తి -సీలేరు

గిరిజనుల అభివృద్ధికి పోలీస్‌ శాఖ నిరంతరం కృషి చేస్తుందని చింతపల్లి అడిషనల్‌ ఎస్‌పి కొమ్ము శివప్రతాప్‌కిషోర్‌ అన్నారు. జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో శుక్రవారం సంజీవని మెగా మెడికల్‌ క్యాంప్‌, వివాహ వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. గాలికొండ పంచాయతీ పరిధి పుట్టకోట, పాత్రుని గుంట, గొర్లి గొంది, లేత మర్రి, సప్తగూడ, తదితర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో యువత హాజరై వాలీబాల్‌ పోటీల్లో పాల్గొన్నారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ సౌజన్యంతో గిరిజనులకు హైజింగ్‌ కిడ్స్‌, దోమతెరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎఎస్‌పి మాట్లాడుతూ గాలికొండ నుంచి పుట్టకోట వరకు రహదారి మంజూరైందని, అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉందని, జిల్లా కలెక్టర్‌తో సంప్రదింపులు చేసి రహదారి నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు. పాత్రుని గుంట వరకు రహదారి సౌకర్యం లేక గిరిజనులు అనేక ఇబ్బందులకు గురయ్యే వారని, పోలీస్‌ శాఖ చొరవతో మోటార్‌ బుల్‌ రహదారి ఏర్పాటు చేశామని చెప్పారు. ఒకప్పుడు ప్రజలు మావోయిస్టుల మాటలు విని మోసపోయే వారిని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, గిరిజనులు చైతన్యవంతులయ్యారని పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధిని పోలీస్‌శాఖ కోరుకుంటుందని, పోలీస్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏ సమస్య వచ్చినా జీకే వీధి సిఐ అశోక్‌ కుమార్‌, సీలేరు ఎస్సై రామకృష్ణకు గాని, లేదంటే నేరుగా తనకు గాని తెలియజేస్తే పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జికె.వీధి సిఐ అశోక్‌ కుమార్‌, ఎస్సై అప్పలసూరి, సీలేరు ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️