కోర్టు ఆర్డర్‌ ప్రకారం సిమెంటు ఫ్యాక్టరీ కార్మికులకు నష్టపరిహారం అందించాలి

Mar 6,2024 22:42

ప్రజాశక్తి-తాడేపల్లి : కోర్టు తీర్పు ప్రకారం ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీ కార్మికులకు నష్టపరిహారం అందించాలని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు కోరారు. బుధవారం తాడేపల్లి సిమెంటు ఫ్యాక్టరీ కార్యాలయం వద్ద జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 330 మంది కార్మికులు ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీ యాజమాన్యం కోట్లాది రూపాయలు బకాయిలు పడి ఉంది. న్యాయంగా తమకు రావాల్సిన బకాయిలు రావాలని సంవత్సరాల తరబడి కార్మికులు న్యాయ పోరాటంతో పాటు ఆందోళనలు కొనసాగించారు. కార్మికు లకు నష్టపరిహారం విషయంలో యాజమాన్యం మొదటి నుంచి నిర్లక్ష్య ధోరణి అవలంభించిందని కార్మికులు తెలిపారు. చివరకు కోర్టు ఇచ్చిన తీర్పు కూడా పక్కన పెట్టి కొంత మంది బడా పెట్టుబడిదారుల చేతుల్లోకి భూములు వెళ్లే విధంగా యాజమాన్య ధోరణి ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే అన్యాక్రాంతమైన ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీ భూములను కాపాడాలని కోరారు. ప్రభుత్వం స్పందించ కుంటే దశలవారీ ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ నెల 11వ తేదీ కార్మికుల కుటుంబాలతో కలిసి నిరసనకు సమావేశం తీర్మానిం చింది. సమావేశంలో సిఐటియు నాయకులు వి.దుర్గారావు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, ఐఎఫ్‌టియు, ఎఐఎఫ్‌టియు (న్యూ) నాయకులు టి.వెంకట య్య, డి.సామ్యేలు, ఎ.చెన్నయ్య, కె.ఆదినారాయణ, కె.కృష్ణబాబు పాల్గొన్నారు.

➡️