కోచింగ్‌ సెంటర్ల దోపిడీ

Mar 12,2024 10:21
ఇంటర్‌

ఇష్టానుసారంగా ఇఎపిసెట్‌ శిక్షణ సంస్థలు
తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బుల వసూలు
అనుమతి లేకుండానే ఏర్పాటు
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి
ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఇఎపిసెట్‌లో మంచి ర్యాంకు తప్పని సరి. పిల్లలకు బంగారు భవిష్యత్తు కోసం వారిని ఇంజినీర్‌, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌, ఫార్మసీ సైంటిస్ట్‌లుగా చూడాలనుకోవడం ప్రతి సామాన్య తల్లిదండ్రుల కల. దీని కోసం వారు తలను తాకట్టుపెట్టి మరీ కోచింగ్‌లు ఇప్పిస్తుంటారు. దీన్నే కొంతమంది కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు క్యాష్‌ చేసుకుంటున్నారు. ఆకర్షణీయమైన ప్రకటనలతో అడ్డుగోలుగా దోచుకుంటున్నారు.ఇఎపిసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధించి, మంచి కాలేజీలో సీటు పొందాలనే తపనతో విద్యార్థులు కోచింగ్‌ సెంటర్ల బాటపడుతున్నారు. ఇంటర్‌ పరీక్షలు పూర్తి అయిన తరువాత ఇఎపి సెట్‌కు సుమారు 50 రోజుల సమయం ఉంటుంది. ఈ సమయంలో షార్ట్‌టర్మ్‌ పేర కోచింగ్‌ సెంటర్లు విద్యార్థులకు వలవేస్తున్నాయి. ‘సమయం లేదు.. త్వరపడండి.. డబ్బులు కట్టండి.. ర్యాంకు కొట్టండి..’ అంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను ఊరిస్తున్నాయి. ప్రముఖులకు శిక్షణ ఇచ్చిన ఫ్యాకల్టీ తమ కోచింగ్‌ సెంటర్లలో అందుబాటులో ఉన్నారని, తమవద్దే చేర్చాలంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. పదుల సంఖ్యలో కేంద్రాలు..జిల్లా వ్యాప్తంగా దాదాపు 60 కోచింగ్‌ సెంటర్‌లు ఉన్నాయి. ఒక్క రాజమహేంద్రవరం నగరంలోనే 40 వరకు శిక్షణా సంస్థలు ఉన్నాయి. వీటిపై అధికారుల ఆజమాయిషీ లేకపోవడతో ఒక్కో కోచింగ్‌ సెంటర్‌లో ఒక్కో తరహా ప్యాకేజీని అమలు చేస్తున్నారు. షార్ట్‌ టర్మ్‌ పేర రూ.6వేల నుంచి రూ.20వేల వరకూ ఫీజలు వసూలు చేస్తున్నారు. హాస్టల్‌ వసతికి మరింత అదనం. హాస్టలర్స్‌కు రోజుకు రూ.150 నుంచి రూ.250 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. మరికొన్ని సెంటర్ల నిర్వాహకులు కోచింగ్‌, హాస్టల్‌కు కలిపి ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నారు. ఇంకొన్ని సెంటర్లు మరో అడుగు ముందుకేసి ఆఫర్లను సైతం అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఏ సెంటర్‌లో నాణ్యమైన కోచింగ్‌ అందుతుందో తెలియక విద్యార్థులు తికమక పడుతున్నారు.ప్రతిభ ఉన్న విద్యార్థులకు వలకార్పొరేట్‌, ప్రయివేటు, ప్రభుత్వ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల వివరాలను సంబంధిత కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ముందుగానే సేకరించాయి. అలాంటి విద్యార్థులకు సెంటర్లు వల వేస్తున్నాయి. సబ్జెక్టులలో పట్టుసాధించి, ఇంటర్‌లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులైతే ఇఎపి సెట్‌లో మెరుగైన ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది. ఇలాంటి విద్యార్థులను కోచింగ్‌ సెంటర్‌లో చేర్చుకుంటే.. వారి ప్రతిభను తమ ఖాతాలో వేసుకోవచ్చనే ఎత్తులు వేస్తున్నాయి. కొన్ని కోచింగ్‌ సెంటర్లవారు ఇంటర్‌ కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారు. ఆయా కాలేజీల విద్యార్థులు నేరుగా తమ కోచింగ్‌ సెంటర్‌కు వచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నాయి. లేదా వారి ఫోన్‌నెంబర్ల ఆధారంగా చిరునామాలను సేకరించి పిఆర్‌ఒల ద్వారా సెంటర్లలో చేరేలా ఒత్తిడి తెస్తున్నారు.మొత్తం ఫీజు చెల్లిస్తేనే తరగతి గదిలోకి…కోచింగ్‌ సెంటర్లలో చేరే విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు పిండుతున్నారు. దరఖాస్తు పూరించిన వెంటనే అడ్మిషన్‌ ఫీజు చెల్లించాల్సిందే. మొత్తం ఫీజు చెల్లిస్తేనే తరగతి గదిలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తామని తెగేసి చెబుతున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి అడ్మిషన్‌, కోచింగ్‌ పేరిట రూ.20 వేలకుపైగా పిండుతున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తే రూ.1000 రాయితీ ఇస్తామని ఊరిస్తున్నారు. నగరంలో 40 కోచింగ్‌ సెంటర్లు ఉంటే వీటిలో సగానికిపైగా సెంటర్లకు ఎలాంటి అనుమతులు లేవు.
చర్యలు తీసుకోవాలి…
ప్రవేశ పరీక్షలకు శిక్షణ పేరుతో జిల్లా వ్యాప్తంగా అనేక కోచింగ్‌ సెంటర్‌లు వెలిశాయి. మూడు నుంచి ఆరు వారాలపాటు శిక్షణ ఇచ్చేందుకు కాలేజీ ఫీజులకంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఆకర్షణీయమైన ప్రకటనలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. తల్లిదండ్రుల జేబులను గుల్లచేస్తున్నారు. అనేక సెంటర్‌లకు ప్రభుత్వ అనుమతుల్లేవు. అయినా ఏళ్ల తరబడి యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ పరీశీలించి విద్యార్థులకు న్యాయం చేయాలి. అధికారులు స్పందించకపోతే ఆందోళన చేస్తాం.- ఎన్‌.రాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ

➡️