కొబ్బరి పార్కు కలేనా?

జిల్లా వ్యాప్తంగా 53 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కొబ్బరి సాగు

కొబ్బరి పార్కుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్‌)

వాగ్ధానాలకే పరిమితం

ఆచరణలో కనిపించని చిత్తశుద్ధి

రైతులకు తప్పని ఎదురుచూపులు

కొబ్బరి పార్కు కొన్ని దశాబ్దాలుగా ఉద్దానం రైతును ఊరిస్తున్న అంశం. ఈ అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా అదిగో పార్కు. ఇదిగో అనుమతులు అంటూ పాలకులు హడావుడి చేస్తున్నారు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో నాయకులకు ఇది ప్రధాన అస్త్రంగా మారిపోయింది. కొన్ని దశాబ్ధాలుగా కొబ్బరి అంశం పలు దఫాలుగా తెరపైకి వచ్చి కనుమరుగవుతోంది. మాటల్లో తప్ప చేతల్లో పనులు జరగడం లేదనేది బహిరంగ సత్యం. కానీ, ఉద్దానం కొబ్బరి రైతాంగంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న వేలాది మంది రైతుల మేలుచేకూర్చే కొబ్బరి పార్కు మాత్రం కలగానే మిగిలిపోయింది.

ప్రజాశక్తి- కవిటి

జిల్లా వ్యాప్తంగా 53 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కొబ్బరి సాగు చేస్తున్నారు. అందులో ఒక్క కవిటి మండలంలోని సుమారు 23 వేల ఎకరాలకు పైగా కొబ్బరి సాగు జరుగుతోంది. నమ్మకం నాణ్యతలో ఉద్దానం కొబ్బరికి పెట్టింది పేరు. దీంతో గోదావరి జిల్లాలతో పాటు మిగతా ప్రాంతాల్లో పండిన కొబ్బరి కంటే ఉద్దానం కొబ్బరి ధర అధికంగా ఉంటుంది. అయితే గత కొంతకాలంగా ఉద్దానం కొబ్బరిని తెగుళ్లు, వ్యాధులు చుట్టుముట్టడం, వ్యవసాయ ఖర్చులు పెరగడం, నిలకడ నిలకడ లేని ధరలతో కొబ్బరి రైతు విలవిలలాడుతున్నాడు. ఎంత కష్టపడినా సరే సరైన ప్రతిఫలం లభించడం లేదనే నిరాశలో ఉన్నాడు. ఓవైపు పెరుగుతున్న ఖర్చులు మరోవైపు తరుగుతున్న ఆదాయాలతో కుటుంబాలు నడపలేక రైతన్న సతమతమవుతున్నాడు. ఇలాంటి సమయంలో తాను పండించిన పంటకు సరైన గిట్టుబాటు, అదనపు ప్రయోజనాలు లభించా లంటే దానికి ప్రభుత్వ సహకారం అవసరమని భావిస్తున్నాడు.సాంకేతిక కారణాలు సాకుతో…మరోవైపు కొబ్బరి పార్కు ఏర్పాటుకు సాంకేతిక కారణాలు సాకుగా చూపి మభ్యపెట్టే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి కవిటి మండలం తీర ప్రాంతానికి దగ్గరగా ఉండడం తరచూ తుపాన్లకు గురవుతోంది. దీంతో మొదటి నుంచి ఈ ప్రాంతంలో ఎకరాకు 80 నుంచి 120 కొబ్బరి చెట్లు నాటే సంప్రదాయం ఉంది. అయితే 2018లో వచ్చిన తితిలీ తుపానుకు సగానికి పైగా చెట్లు పోయాయి. ప్రస్తుతం అక్కడ కొబ్బరి పార్కు ఏర్పాటు చేస్తే సరిపడే కాయలు ఉత్పత్తి చేసే అవకాశం లేదని బుకాయింపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరాకు 50 నుంచి 60 కొబ్బరి చెట్లు ఉండాలి. కానీ, ఇక్కడ అంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటున్నాయి. మరో వైపు కవిటి మండలంలో చిక్కాఫ్‌, కొబ్బరి ఉత్పత్తిదారుల సంస్థ పేరుతో రెండు సంస్థలు కొబ్బరి రైతుల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నాయి. మండలంలో ఉన్న కొబ్బరి రైతులందరూ ఈ రెండు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. సుమారు 90 శాతం పైగా రైతులు ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో సభ్యత్వం పొంది ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కొబ్బరి పార్కు రావాలంటే రైతులు సంఘాలుగా ఏర్పడాలని కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఉద్యానశాఖ ఆధీనంలో మండలాల్లోనే కాక జిల్లా వ్యాప్తంగా ఎంత విస్తీర్ణంలో కొబ్బరి పంట సాగు చేస్తున్నారు. ఎంతమంది కొబ్బరి రైతులు ఉన్నారు, కొబ్బరిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతమంది జీవిస్తున్నారనే అంశాలు పూర్తి డేటాతో సహా ఉన్నాయి. కానీ, ఏదో ఒకటి చెప్పాలి, ఏదోఒక విధంగా ఈ అంశాన్ని దాటవేయాలనే ధోరణికి ఈ సంఘటనే ఉదాహరణ అని పలువురు రైతులు వాపోతున్నారు. నాణ్యమైన, నమ్మకంతో కూడిన పంటను రైతులు అందిస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు తమపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికే వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమవుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు తమకు అండగా నిలవాలి తప్ప అంగట్లో నిలబెట్టకూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొన్ని వేల కుటుంబాలకు ఆసరా కల్పించే కొబ్బరి పార్కు ఏర్పాటుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరుతున్నారు.

 

➡️