కొండపి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా

ప్రజాశక్తి-పొదిలి: కొండపి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. శుక్రవారం మర్రిపూడి గ్రామ సెంటర్‌ నుంచి పృథులగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మెట్లు, ఎస్‌టి రాజుపాలెం కాలనీ వరకు రూ.8.5 కోట్లతో సుమారు 10.5 కిలోమీటర్ల రహదారిని తారురోడ్డుగా మార్చే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ పనులను వచ్చే నెల 25న స్వామివారి బ్రహౌత్సవాల నాటికి పూర్తిచేసే విధంగా గుత్తేదారులను ఆదేశించామన్నారు. ఈ మార్గంలో ఉన్న 1.8 కిలోమీటర్ల ఆటవీ భూమిలో అనుమతికి ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడి అనుమతులు తెప్పిస్తామన్నారు. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిసి ఈ నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పనులపై సుమారు 80 కోట్ల ప్రతిపాదనలను ఇచ్చామన్నారు. వీటిపై ఆయన సానుకూలంగా స్పందించి పరిపాలనా అనుమతులు ఇస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా పృథులగిరి కొండపైకి తారురోడ్డు నిర్మాణానికి మరో ఎనిమిది కోట్లు, మండలంలోని చిలంకూరు వద్ద ముసివాగుపై చెక్‌డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. అదేవిధంగా పొదిలి చిన్నచెరువు నుంచి గుండ్లసముద్రం, మర్రిపూడి చెరువులకు సాగర్‌ నీటిని అందించే భూగర్భ పైపులైన్‌ నిర్మాణానికి రూ.32 కోట్లు పరిపాలనా అనుమతిలో ఉన్నాయన్నారు. ఇతర మండలాలలో అవసరమైన రహదారుల అభివృద్ధి ఇతర పనులకు త్వరలో నిధులు విడుదల కానున్నాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, జడ్పీటీసీ మాకినేని సుధారాణి వెంకట్రావు, మండల పార్టీ అధ్యక్షులు దద్దాల మల్లికార్జున, సీనియర్‌ నాయకులు బోదా రమణారెడ్డి, బోగసముద్రం విజయ భాస్కర్‌ రెడ్డి, మాచేపల్లి నాగయ్య, ఇంకొల్లు పిచ్చిరెడ్డి, ఇంకొల్లు సుబ్బారెడ్డి, పిఏసిఎస్‌ చైర్మన్లు మాకినేని వెంకట్రావు, బోగసముద్రం విజయభాస్కర్‌రెడ్డి, మర్రిపూడి సర్పంచ్‌ భాస్కర్‌, ఎంపీటీసీ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️