కొండ దిగని బియ్యం ధరలు

Feb 22,2024 22:04
కొండ దిగని బియ్యం ధరలు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిబియ్యం ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ధరలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన నెల వ్యవధిలో పది శాతం పైగా బియ్యం ధరలు పెరిగాయి. మధ్య తరగతి, ఆపై వర్గాల వారు సన్న బియ్యంపై మొగ్గు చూపిస్తుండడంతో రకరకాల పేర్లతో వ్యాపారులు బియ్యం ధరలను పెంచేస్తున్నారు. సామాన్యులు, చిరు ద్యోగులు, వివిధ రకాల వృత్తులపై ఆధార పడిన వారు పెరుగుతున్న బియ్యం ధరలను భరించలేకపోతున్నారు. గతంలో సన్న రకం బియ్యం వెరైటీని బట్టి 26 కేజీల బస్తా రూ.1,150 నుంచి రూ.1,300 వరకు ఉండేది. ఇప్పుడు ఆ ధర రూ.1,400 నుంచి రూ.1,700 వరకు పెరిగింది. గత ఆరు నెలల్లో రూ.250 నుంచి రూ.400 వరకు ధరలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి లైసెన్సు పొంది జిఎస్‌టి పరిధిలో ఉంటూ హోల్‌సేల్‌ డీలర్లు, ట్రేడర్లు బియ్యం ధరలను విచ్చలవిడిగా పెంచుతుంటే సివిల్‌ సప్లయిస్‌ అధికారులు నియంత్రించలేకపోతున్నారు. బియ్యం ధరలు కేజీ ఒక్కింటికి రూ.45 నుంచి రూ.60 వరకు ఉన్నాయి. సన్నరకం, హెచ్‌ఎంటి, స్టీమ్‌ రకరకాల పేర్లతో బియ్యం ధరలను పెంచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయంటూ కొన్ని రకాల బియ్యం ధరలను మరింత పెంచుతున్నారు. బియ్యం సంచులపై వివిధ రకాల బ్రాండ్ల పేర్లు చూపించి సూపర్‌ ఫైన్‌ రకం అంటూ 26 కేజీల బస్తా రూ.1,500 నుంచి రూ.1,650కి వ్యాపారులు అమ్ముతున్నారు. ఉభయ గోదాదవరి జిల్లాల్లోని రైస్‌ మిల్లుల నుంచి బియ్యం ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి. దీంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న బియ్యం ధరలను చూసి ప్రజలు ఆందోళన చెందుతుంటే సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని గతంలో మిల్లింగ్‌ చేయించి బియ్యాన్ని వినియోగించేకునే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అధిక శాతం రైతులు తమ ధాన్యాన్ని పూర్తిగా అమ్మేసి సన్న బియ్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో బియ్యానికి డిమాండ్‌ పెరిగింది. వినియోగదారులు పెరగటంతో ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత రేషన్‌ బియ్యం వినియోగదారుల నుంచి బహిరంగ మార్కెట్‌లోకి చేరుకుంటోంది. ఎక్కువ శాతం మంది ఉచిత బియ్యాన్ని కేజీ రూ.15 నుంచి రూ.18లకు వ్యాపారులకు అమ్మేస్తున్నారు. దీంతో సన్న బియ్యం, మధ్య రకం బియ్యానికి మార్కెట్‌లో డిమాండ్‌ ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి.

➡️