కేరళ పట్ల కేంద్రం వివక్షను వ్యతిరేకిస్తూ సిఐటియు నిరసన

Feb 7,2024 21:35 #CITU, #nirasana

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖ): కేరళ రాష్ట్రం పట్ల బిజెపి ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ సిఐటియు విశాఖపట్నం జగదాంబ జోన్‌ కమిటీ ఆధ్వర్యాన బుధవారం ఎల్‌ఐసి కార్యాలయ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్‌ నాయకులు వై.రాజు మాట్లాడుతూ, కేరళలోని వామపక్ష ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. జిఎస్‌టి పరిహారం, రెవెన్యూ లోటు గ్రాంట్‌, రుణ పరిమితి పెంపు, అనేక ఇతర అంశాల ద్వారా కేరళకు రావలసిన మొత్తం రూ.57 వేల కోట్లను ఇవ్వకుండా బిజెపి పాలకులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ, ఇబ్బందులు పెట్టడం దుర్మార్గమన్నారు. బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తూ, గవర్నర్లను అడ్డుపెట్టుకొని తన పెత్తనాన్ని చెలాయించే ప్రయత్నం చేస్తోందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులను పెండింగ్‌లో పెట్టి ఆయా రాష్ట్రాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళ రాష్ట్రం కరోనాను ఎదుర్కొన్న విధానం, రెండోసారి ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న తీరును బిజెపి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కేరళ సిఎం ఆధ్వర్యాన ఈ నెల 8న ఢిల్లీలో చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి ప్రజానీకమంతా మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు, మత్య్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎం.సుబ్బారావు, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కె.నరసింగరావు, డివైఎఫ్‌ఐ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సంతోష్‌ కుమార్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️