కేంద్రం ఒంటెద్దు పోకడలు మానుకోవాలి- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Dec 8,2023 08:28 #ukkunagaram, #visakha steel

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు మానుకోవాలని, కార్మికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 1029వ రోజుకు చేరాయి. దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ డబ్ల్యుఆర్‌ఎంా 1, 2 విభాగాల కార్మికులు కూర్చున్నారు. భెల్‌ పరిశ్రమకు చెందిన ఐఎన్‌టియుసి, సిఐటియు నేతలు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. దీక్షలనుద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయని, విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి కార్మికులు ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారని గుర్తుంచుకోవాలని అన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో భెల్‌ కార్మిక నాయకులు వి.బాబూరావు, జిటిపి.ప్రకాష్‌, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఎన్‌.రామారావు, జె.రామకృష్ణ, కె.పరంధామయ్య, గుమ్మడి నరేంద్ర, యు.వెంకటేశ్వర్లు, డబ్ల్యుఆర్‌ఎంా 1, 2 విభాగాల నాయకులు కె.తిరుపతిరాజు, ఎమ్‌ఎస్‌ఆర్‌.ప్రసాద్‌, వి.మురళీ, దామా హరిబాబు, ఎస్‌.తులసి, కె.భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️