కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ రాజీనామా

– వెనువెంటనే రాష్ట్రపతి ఆమోదం

– ఇక ఏకసభ్య ఎన్నికల కమిషన్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెనువెంటనే ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటికే మరో కమిషనర్‌ అనుప్‌ పాండే పదవీ విరమణ చేశారు. ఇప్పుడు గోయల్‌ రాజీనామా చేశారు. ఈ పరిణామాలతో త్రిసభ్య భారత ఎన్నికల సంఘం ఏకసభ్య కమిషన్‌గా మిగిలింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మాత్రమే ఎన్నికల సంఘంలో మిగిలారు. ఈ నెల 15న ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేస్తారని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరుణ్‌ రాజీనామా విస్మయానికి గురిచేస్తోంది. ఆయన రాజీనామా సార్వత్రిక ఎన్నికల నిర్వహణపైనా ప్రభావం చూపవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రాజీనామాకు కారణాలేమిటో తెలియరాలేదు. 2022 నవంబర్‌ 21లో ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయెల్‌ బాధ్యతలు స్వీకరించారు. 1985 బ్యాచ్‌ కు చెందిన ఐఎఎస్‌ గోయెల్‌ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల కమిషనర్‌గా ఈయన నియామకం కూడా వివాదస్పదమైన సంగతి విదితమే. సుప్రీంకోర్టులో కూడా ఈయన నియామకాన్ని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌ (ఎడిఆర్‌) సంస్థ సవాలు కూడా చేసింది.

➡️