కృష్ణానదికి బురద నీరు వస్తోంది..

కాంట్రాక్టర్ల గ్రీవెన్స్‌లో అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌
ప్రజాశక్తి-గుంటూరు :
మిచౌంగ్‌ తుపాను అనంతరం అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రత్యేక పారిశుధ్య పనుల నిర్వహణపై డిప్యూటీ కమిషనర్‌, ఎంహెచ్‌ఓ, శానిటరీ సూపర్వైజర్లతో కమిషనర్‌ గురువారం సమీక్షించారు. తుపాను వలన వర్షపు నీరు ప్రాంతాల్లో బెయిల్‌ అవుట్‌ చేసిన తర్వాత ప్రజారోగ్య సిబ్బంది తప్పనిసరిగా ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. బ్లీచింగ్‌ చల్లడం, రోడ్ల మీద పేరుకున్న సిల్ట్‌ తొలగించడం, కల్వర్టుల వద్ద నిలిచిన అడ్డంకులను తొలగించడం చేయాలన్నారు. వార్డు సచివాలయాల వారీగా కార్యదర్శులు పక్కాగా పారిశుధ్య పనులు జరిగేలా చూడాలన్నారు. డివిజన్‌లో సమస్యలు లేకుండా ఇన్‌స్పెక్టర్లు భాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. కృష్ణానదికి తుపాన్‌ వర్షాల వలన నీరు కొంత బురదతో వస్తుందని, నగర ప్రజలు తాగునీటిని కాచి వడకట్టుకొని తాగాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ రవీంద్ర, ఎంహెచ్‌ఓ (ఎఫ్‌ఏసి) మధుసూదన్‌ పాల్గొన్నారు.
కార్మికురాలి కుటుంబానికి పరిహారం..
ఇంజినీరింగ్‌ విభాగంలో అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో గాంధీ పార్క్‌లో విధులు నిర్వహిస్తూ ఇటీవల మరణించిన టి.విజయకుమారి కుటుంబానికి పరిహా రాన్ని కమిషనర్‌ అందచేశారు. జిఎంసిలోని కమిషనర్‌లో ఛాంబర్‌లో విజయకుమారి భర్త రమణారావుకు ఎక్స్‌గ్రేషియా రూ.2 లక్షలు, మట్టి ఖర్చులు రూ.15 వేల చెక్కును అందించారు. జిఎంసి నుండి అందించాల్సిన పరిహారాలు, పిఎఫ్‌, త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని విభాగాధిపతుల్ని ఆదేశించారు.
బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చర్యలు
కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి అన్నారు. గురువారం కమిషనర్‌ ఛాంబర్‌లో కాంట్రాక్టర్ల గ్రీవెన్స్‌ నిర్వహించారు. గ్రీవెన్స్‌లో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్దేశిత గడువులో పరిష్కారం చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లు తాము పూర్తి చేసిన పనులకు సంబంధించి బిల్లుల ఆన్‌లైన్‌ చేయడం, చెల్లింపుల్లో ఎదురయ్యే సమస్యలను ప్రతి శుక్రవారం జరిగే స్పెషల్‌ గ్రీవెన్స్‌లో తమ దృష్టికి తీసుకురావొచ్చన్నారు. ప్రధాన డ్రెయిన్లలో జరిగిన పూడిక తీత పనులపై పలు ఫిర్యాదులు అందాయని, క్షేత్రస్థాయి పర్యటనలోనూ కొన్ని ప్రాంతాల్లో పూడికతీత పనులు సమగ్రంగా జగరకపోవడం గమనించామని, సదరు పనులకు సంబంధించి బిల్స్‌ చెల్లింపుకు ముందు ఎస్‌ఇ పరిశీలించి పంపాలని ఆదేశించారు. బిల్లుల చెల్లింపులో కూడా జాప్యం లేకుండా అన్ని దశల్లో వేగంగా రికార్డయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఇని ఆదేశించారు. కార్పొరేటర్ల నుండి అర్జీలు స్వీకరణకార్పొరేటర్ల నుండి అందే ఫిర్యాదులు, ఆర్జీల పరిష్కారంపై వార్డుల వారీగా నివేదిక ఇవ్వాలని విభాగాదిపతులను కమిషనర్‌ ఆదేశించారు. తన ఛాంబర్‌లో నగరంలోని కార్పొరేటర్లతో వార్డుల్లో అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలపై ప్రత్యేకంగా సమీక్షించారు.

➡️