కృత్రిమ అవయవాలు పంపిణీ

Jan 4,2024 21:45

ప్రజాశక్తి – కొత్తవలస : మండలంలోని మంగళపాలెంలోని గురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు రాపర్తి జగదీష్‌బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. విశాఖ రైల్వే డివిజన్‌ మేనేజర్‌ సౌరబ్‌ ప్రసాద్‌ పాల్గొని వికలాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. ముందుగా కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని, గురుదేవా హాస్పిటల్‌ను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. డిఆర్‌ఎం ప్రసాద్‌ మాట్లాడుతూ తాను ఉద్యోగ రీత్య వివిధ ప్రాంతాల్లో పని చేశానని కానీ విశాఖ రైల్వే డివిజన్‌కు వచ్చిన తరువాత, కొత్తవలస రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఈ గ్రామంలో గురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఉందని, దాని ద్వారా కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమానికి తనను ముఖ్యఅతిథిగా ఆహ్వానించేందుకు వ్యవస్థాపకులు వచ్చారని సిబ్బంది చెప్పటంతో సంతోషం వ్యక్తం చేశానని అన్నారు. గతేడాది కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో సత్వరమే స్పందించి గురుదేవ హాస్పిటల్‌ నుండి అంబులెన్స్‌ పంపించి యాక్సిడెంట్‌ అయిన ప్రాంతంలో సేవలు కూడా అందించారని, అలాంటి ట్రస్టును సందర్శించేందుకు తనను ఆహ్వానించడంతో ఎలాగైనా రావాలని అనుకున్నానని అన్నారు. ఉన్నతమైన చదువు చదివిన జగదీష్‌ బాబు సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందించి పునర్జన్మ ప్రసాదిస్తున్నారని అన్నారు. తనవంతుగా ట్రస్టుకు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️