కూరగాయల ధరలకు రెక్కలు

పేద, మధ్య తరగతి ప్రజల గగ్గోలు
ప్రజాశక్తి – పాలకొల్లు
ఆనపకాయ రూ.వంద, దోసకాయ రూ.60, వంకాయలు కిలో రూ.100-120, బీరకాయలు రూ.80-100, క్యాలిఫ్లవర్‌ రూ.50-80 ఈ ధరలు నగరాల్లో మాల్‌లో అనుకుంటున్నారా..కాదు పాలకొల్లు శనివారం వారపు సంతలో ధరలు ఇవి. సాధారణంగా వేసవి కాలంలో ఈ ధరలు ఉంటాయి. అయితే కాయగూరలు పుష్కలంగా పండే శీతాకాలంలో ఈ ధరలు ఉన్న మాట నిజమే. కొన్నిరోజుల క్రితం వచ్చిన తుపాన్‌ కారణంగా పంటలు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలలో దారుణంగా పాదులు పడిపోవడంతో కాయగూరల ఉత్పత్తి తగ్గి ధరలు దారుణంగా పెరిగాయి. దాదాపు అన్ని కాయగూరల ధరలు రెట్టింపు పైగా పెరిగాయి. కొంతలో కొంత వర్షాలకు ముందు కిలో రూ.70 ఉన్న ఉల్లిపాయలు రూ.34-50 తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్లో టమోటా ఒక్కటే కిలో రూ.30-50 మధ్యన ఉంది. మునగకాడ రూ.15 ఉంది. దేశవాళి చిక్కుడు కాయలు కిలో రూ.80 నుంచి 160కు పెరిగింది. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. వివాహ శుభకార్యాలు జరిపే వారు, భవాని, అయ్యప్ప మాలధారులు మరింతగా గగ్గోలు పెడుతున్నారు.మాంసాహారులు గగ్గోలుఇదిలా ఉండగా మాంసాహారులు కూడా పెరిగిన చికెన్‌, గుడ్డు, చేపల ధరలతో గగ్గోలు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోడిగుడ్డు ధర రికార్డు స్థాయిలో 5.90 ఉండటంతో రిటైల్‌గా రూ.7 పైన ఉంది. కార్తీక మాసంలో చికెన్‌ ధర కిలో రూ.160 తగ్గి క్రమేణా పెరుగుతూ ప్రస్తుతం రూ.200 ఉంది. చేపల ధరలు దారుణంగా పెరుగుతున్నాయి. అసలు ప్రజల వద్ద డబ్బులు లేని ఈ సమయంలో క్రిస్మస్‌, సంక్రాంతి శుభవేళ ధరలు చూసి సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేక గగ్గోలు పెడుతున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నికల్లో నిమఘ్నమై ధరల గురించి పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

➡️