కిడ్నీ ఆస్పత్రి దేశానికే తలమాని

'ఉద్దానం అంటే ఉద్యానాల వనం. అటువంటి పచ్చని ప్రాంతాన్ని

కిడ్నీ సూపర్‌ స్పెషాల్టీ వద్ద ప్రజాప్రతినిధులతో సిఎం జగన్మోహన్‌ రెడ్డి

కందశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపాం

  • ఫిబ్రవరిలో ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు
  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెల్లడి
  • కిడ్నీ సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌, సుజలధార ప్రాజెక్టు ప్రారంభం
  • పలాస నియోజకవర్గానికి పలు వరాలు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, పలాస, కంచిలి, వజ్రపుకొత్తూరు

‘ఉద్దానం అంటే ఉద్యానాల వనం. అటువంటి పచ్చని ప్రాంతాన్ని కిడ్నీ మహమ్మారి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసింది. ఈ పరిస్థితిని నా పాదయాత్రలో కళ్లారా చూశా. ఈ ప్రాంతంలో పాదయాత్ర సమయంలో ప్రజల గోడు చెప్పినప్పుడు నేను చెప్పిన మాట నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను. 2018 డిసెంబర్‌ 30 తేదీన ఇచ్చిన మాట ప్రకారం 200 పడకల ఆస్పత్రి నిర్మించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి మీ ఎదురుగా నిలబడినందుకు గర్వపడుతున్నా’.- ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిఉద్దానం కిడ్నీ సూపర్‌ స్పెషాల్టీ ఆసత్రి, రీసెర్చ్‌ సెంటర్‌లో వచ్చే ఫిబ్రవరి నుంచి శస్త్రచికిత్సలను ప్రారంభించి దేశానికే తలమానికంగా నిలిపేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. పలాసలో రూ.85 కోట్లతో నిర్మించిన కిడ్నీ సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌, కంచిలి మండలం మకరాంపురంలో రూ.700 కోట్లతో నిర్మించిన వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టును గురువారం ప్రారంభించారు. అనరతరం కాశీబుగ్గ రైల్వే క్రీడా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రీసెర్చ్‌ సెంటర్‌లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం అన్ని విభాగాలతో పాటు డయాలసిస్‌ సెంటర్లు, ఆపరేషన్‌ థియేటర్లు మెరుగైన ప్రమాణాలతో ఏర్పాటు చేశామని, బాధితులు తమ ఆరోగ్య అవసరాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదంటూ ఆయన భరోసా ఇచ్చారు. జిల్లాలోని కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు ఏడు మండలాల్లో క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌ చేయిస్తామని చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన 37 రకాల ఔషధాలను స్థానికంగా ఉన్న అన్ని పిహెచ్‌సిల మొదలు, రీసెర్చ్‌ సెంటర్‌ వరకు అందుబాటులో ఉంచి ఉచితంగా ఇంటి వద్దకే అందిస్తామని తెలిపారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల వైద్య ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.పది వేలకు వేలకు పెంచామని గుర్తుచేశారు.శాశ్వత పరిష్కారం కోసం రక్షిత మంచినీరుఉద్దానం కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి ఏడు మండలాల్లోని 807 గ్రామాలకు సురక్షిత నీరు అందించే వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టు ద్వారా సురక్షిత నీరు అందిస్తున్నట్లు తెలిపారు. రెండో దశ కింద రూ.265 కోట్లతో పాతపట్నం నియోజకవర్గంలోని 448 గ్రామాలకు రక్షిత మంచినీటి అందించనున్నామని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు కలిసి పొత్తులతో సాగిన టిడిపి ప్రభుత్వంలో ఉద్దానం కిడ్నీ సమస్య ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారువిశాఖను పరిపాలనా రాజధానిగా చేసేందుకు ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షంలో ఉంటూ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ఉత్తరాంధ్రలో ఓ బిల్డింగ్‌ కట్టినా, అభివృద్ధి చేసినా, సిఎంగా ఇక్కడే వచ్చి ఉంటానన్నా, మెడికల్‌ కాలేజీలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు కడతామన్నా ఓర్వలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని పెత్తందారులుగా మారి దోచుకోవాలని చూస్తున్న నాన్‌ లోకల్‌ పొలిటీషియన్లను వచ్చే ఎన్నికల్లో శాశ్వతంగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.ఇది అభివృద్ధి కాదా..?ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ మహమ్మారితో వేలాది మంది మృత్యువాత పడ్డారని మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుతో ప్రజల కష్టాలు నేటితో తీరనున్నాయని చెప్పారు. వైసిపి ప్రభుత్వం సంక్షేమం తప్ప అభివృద్ధి చేయడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌, సుజలధార ప్రాజెక్టు అభివృద్ధిలో భాగం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడంపై ప్రతిపక్షాలు వక్రభాష్యాలు చెప్తున్నాయని, వైసిపిలో ప్రతి ఎమ్మెల్యే గెలవాలి… జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నదే తమ ఆశయమన్నారు. తన నియోజకవర్గంలో మార్చినా అభ్యర్థిని గెలిపించుకు వస్తామని చెప్పారు.కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుతో ఉద్దానం ప్రాంత ప్రజల కలలు సాకారమయ్యాయని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. హిరమండలం నుంచి పైపుల ద్వారా సురక్షితమైన తాగునీటిని ఎనిమిది మండలాల ప్రజలకు తరలించేందుకు రూ.700 కోట్లు వెచ్చించినట్లు వివరించారు.పలాసకు పలు వరాలుపలాస నియోజకవర్గానికి సంబంధించి పలు అంశాలకు నిధులు కేటాయించాలని మంత్రి అప్పలరాజు చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందించారు. మూలపేట పోర్టు కనెక్టివిటీకి నౌపడ-వెంకటాపురం డబుల్‌ రోడ్డు చేయడానికి రూ.ఐదు కోట్లు, మదనగోపాలసాగరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.60 కోట్లు, బెండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.ఏడు కోట్లు మంజూరు చేశారు.అభివృద్ధి పనుల శిలాఫలకాలు ఆవిష్కరణసభా ప్రాంగణం వద్ద పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను సిఎం ఆవిష్కరించారు. ఎచ్చెర్లలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విశ్వ విద్యాలయంలో రూ.18 కోట్లతో నూతనంగా నిర్మించిన వైఎస్సార్‌ బాలుర వసతిగృహానికి సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పలాసలో 60.8 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక క్లస్టర్‌ను ప్రారంభించారు.విన్నపాలకు వదల్లేదుసిఎంను కలిసి తమ సమస్యలు చెప్పుకోవాలని ప్రయత్నించిన పలువురికి నిరాశే ఎదురైంది. తన రెండెకరాల భూమిని కౌన్సిలర్లు ఆక్రమించుకున్నారని సిఎంకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన కాశీబుగ్గకు చెందిన సైని చిన్నమ్మను పోలీసులు అడ్డుకున్నారు. జలుమూరు మండలం కరకవలసకు చెందిన పేరాడ అమ్మన్న వికలాంగురాలైన తన కుమార్తె సాయికృష్ణవేణిని తీసుకొచ్చి జగన్‌ను కలవాలని కోరినా సెక్యూరిటీ అడ్డుకున్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు బస్సు కింద పడి కాలు పోగొట్టుకున్న తనకు శాఖాపరమైన తోడ్పాటు అందలేదని, ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని సిఎంను కలిసేందుకు వెళ్లిన సోంపేటకు చెందిన ఆర్‌టిసి కండక్టర్‌ కె.మోహనరావును పోలీసులు అడ్డుకోవడంతో కన్నీటిపర్యంతమయ్యాడు.ట్రాఫిక్‌ ఆంక్షలతో అవస్థలుసిఎం పర్యటన సందర్భంగా పలాస-కాశీబుగ్గలో విధించిన ట్రాఫిక్‌ ఆంక్షలతో ప్రజలకు అవస్థలు తప్పలేదు. బస్సులను రెండు కిలోమీటర్ల దూరంలో ఆపేయడంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. సిఎం పర్యటనకు ఆర్‌టిసి బస్సులను వినియోగించడంతో రవాణా ఇబ్బందులు తప్పలేదు. బహిరంగ సభకు వచ్చిన ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు, భోజన సౌకర్యం కల్పించలేదు. సిఎం ప్రయాణించే మార్గంలో దుకాణాలను మూసివేయించారు.సిఎంకు ఘన స్వాగతంజిల్లాకు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలరావు, వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ప్రభుత్వ విప్‌ పాలవలస విక్రాంత్‌, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్‌, నర్తు రామారావు, వరుదు కళ్యాణి, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్‌, వి.కళావతి, కంబాల జోగులు, రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్‌, శ్రీకాకుళం, విజయనగరం జెడ్‌పి చైర్మన్లు పిరియా విజయ, మజ్జి శ్రీనివాసరావు, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు, కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, డిఐజి హరికృష్ణ, ఎస్‌పి జి.ఆర్‌ రాధిక, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ తదితరులున్నారు.కుటుంబసభ్యులకు అనుమతి నిరాకరణ కిడ్నీ ఆస్పత్రి సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు సిఎంకు ఆహ్వానం పలికేందుకు వెళ్తున్న మంత్రి అప్పలరాజు కుటుంబసభ్యులకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రితో పాటు ఆయన సతీమణి శ్రీదేవి, కుమారులు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి వెళ్లే వారి జాబితాలో మంత్రి కుటుంబ సభ్యుల పేర్లు లేవని స్పష్టం చేశారు. దీంతో మంత్రి అలిగి అక్కడ్నుంచి కిడ్నీ ఆస్పత్రి వద్దకు వెళ్లిపోయారు. శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవినాగ్‌, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్‌ మనోహర్‌ నాయుడును హెలీప్యాడ్‌ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.సిఎం పర్యటన సాగిందిలా…10.35 గంటలకు కంచిలి మండలం మకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకున్నారు.10.50 గంటలకు వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టు ప్రారంభం.11.30 గంటలకు మకరాంపురం నుంచి పలాస హెలీప్యాడ్‌కు చేరుకున్నారు.11.44 గంటలకు కిడ్నీ సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి ప్రారంభించి, బ్లాకులను పరిశీలించిన అనంతరం బాధితులతో మాట్లాడారు.12.30 గంటలకు కాశీబుగ్గ రైల్వే క్రీడా మైదానంలో సభా వేదిక వద్దకు చేరుకున్నారు.12.35 గంటలకు పలు శిలాఫలకాలను ఆవిష్కరించారు.12.39 గంటలకు సభా వేదిక పైకి వచ్చారు.1.07 గంటల నుంచి 1.53 గంటల వరకు ప్రసంగించారు.2.05 గంటలకు బయలుదేరి 2.15 గంటలకు కాశీబుగ్గ కిడ్నీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు.3.15 నుంచి 4.15 గంటల వరకు స్థానిక నాయకులతో మాట్లాడారు. పలువురి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.4.20 గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో మూలపేట పోర్టు నిర్మాణ పనులను ఏరియల్‌ సర్వే ద్వారా వీక్షించారు.

 

 

➡️