కాశీబుగ్గలో భారీ చోరీ

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పోతనపల్లి వీధిలో

పరిశీలిస్తున్న క్లూస్‌ టీమ్‌

రూ.10 లక్షల నగదు అ15 తులాల బంగారం

4 కిలోల వెండి అపహరణ

ప్రజాశక్తి- పలాస

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పోతనపల్లి వీధిలో నివాసముంటున్న కొత్తకోట రామ ఇంట్లో సోమవారం భారీ చోరీ జరిగింది. రూ.పది లక్షలు నగదు, 15 తులాల బంగారపు అభరణాలు, 4 కిలోల వెండి వస్తువులను దొంగలు అపహరించారు. కాశీబుగ్గ పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాశీబుగ్గకు చెందిన కొత్తకోట రామ మూడు రోడ్ల కూడలి వద్ద కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకే రామ కిరాణా షాపుకు వెళ్లిపోయారు. 11 గంటల సమయంలో రామ భార్య లక్ష్మీప్రవీణ, కుమారుడు లోచన్‌ కలిసి కాశీబుగ్గ మూడు రోడ్లు కూడలిలోని తన బంధువుల ఇంటిలో జరిగే శుభకార్యం కోసం ఇంటికి తాళం వేసి వెళ్లారు. తిరిగి 11.45 నిమిషాలకు కొత్తకోట లోచన్‌ ఇంటికి సమీపంలో ఉన్న శారదానగర్లో నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఇంటికి వెళ్లారు. తిరిగి తమ సొంత ఇంటికి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు బద్దలుగొట్టి లోపలికి చొరబడినట్లు గుర్తించారు. తీరా లోపలికి వెళ్లే సమయంలో రెండు బీరువాలను బద్దలగొట్టి వాటిలోని బంగారం, నగదు, వెండి వస్తువులు దొంగలు తీసుకుపోయినట్లు గుర్తించారు. ఇంటి యజమాని రామకు సమాచారం అందించారు. ఇటీవల ఒక ప్రయివేటు చిట్‌ నుంచి రూ.పది లక్షలు ఇళ్ల నిర్మాణం కోసం తీసుకొచ్చామని, వాటినీ దొంగిలించికి పోయారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒక్కసారిగా భారీ స్థాయిలో దొంగతనం జరగడంతో శ్రీకాకుళం నుంచి క్లూస్‌ బృందం వచ్చి దొంగతనం తీరును పరిశీలిస్తుండగా, మరో వైపు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఎస్‌ఐ పారినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

➡️