కార్యకర్తలతో ‘తాటిపర్తి’ ఆత్మీయ సమావేశం

ప్రజాశక్తి-పెద్దారవీడు: మండలంలోని తోకపల్లి పంచాయతీలోని హనుమాన్‌ జంక్షన్‌ (కుంట)లో వైసిపి యర్రగొండపాలెం నియోజకవర్గ నూతన ఇన్‌ఛార్జి తాటిపర్తి చంద్రశేఖర్‌ ఆత్మీయ సమావేశం, పరిచయ కార్యక్రమాన్ని ఏపీ రాష్ట్ర ఇరిగేషన్‌ డైరెక్టర్‌, మాజీ జడ్‌పిటిసి దుగ్గెంపుడి వెంకటరెడ్డి, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక మార్కాపురం రోడ్‌లో నిర్వహించారు. తొలుత ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన తాటిపర్తి చంద్రశేఖర్‌కు వైసిపి శ్రేణులు దుశ్శాలువాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బోడిరెడ్డిపల్లి నుంచి డప్పు వాయిద్యాలతో, బాణాసంచా పేలుస్తూ ర్యాలీగా బయలుదేరి పూల వర్షం కురిపించారు. కుంటకు చేరుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం తాటిపర్తి చంద్రశేఖర్‌ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పెద్దారవీడు మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సాధారణ వ్యక్తినని, మీ వాడినని, నన్ను ఆదరిస్తే మీ సేవకుడిగా ఉంటానని అన్నారు. సమస్యల పరిష్కారానికి మీ వెన్నంటి ఉంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. నీరు-చెట్టు ద్వారా టిడిపిలో దోచుకున్నట్లు ఈ ప్రభుత్వంలో జరగదన్నారు. సాగు, తాగునీటికి సమస్యగా ఉందని, ఈ సమస్యపై మాజీ సిఎం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ గుర్తించి వెలుగొండ ప్రాజెక్టును ఈ ప్రాంతంలో నిర్మించారని, వెలుగొండ రెండు టన్నెల్స్‌ పూర్తి అయ్యాయని, ఈ ప్రాజెక్టును త్వరలోనే సిఎం జగన్మోహన్‌రెడ్డి పూర్తి చేసి ఈ ప్రాంత తాగు, సాగునీటి సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చేస్తారని తెలిపారు. గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని తోలిన వారికి బిల్లులు చెల్లించేందుకు కృషి చేస్తానన్నారు. ఏ గ్రామంలోనైనా నీటి సమస్య ఉంటే సొంత నిధులతోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలు చెవుల్లో ఉన్నాయని, వైసిపి ప్రభుత్వం రూ.4.70 లక్షల కోట్లతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని అన్నారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ట్యాబు లు అందజేసిన ఘనత వైసిపికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ పాలిరెడ్డి కృష్ణారెడ్డి, జడ్‌పిటిసి చలమారెడ్డి, ఎంపీపీ బెజవాడ పెద్దగురవయ్య, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ ఉడుముల శ్రీనివాసరెడ్డి, త్రిపురాంతకం కన్వీనర్‌ పోలిరెడ్డి, త్రిపురాంతకం మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, సర్పంచ్‌ జిల్లెల మల్లీశ్వరి, ఎంపీటీసీ ఉప్పలపాటి భాగ్యరేఖ, మాజీ ఎంపీపీ చిన్న కోటిరెడ్డి, వైస్‌ఎంపీపీ గుండారెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, పోటు కుమారి, గంగయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు అల్లు వెంకటేశ్వరరెడ్డి(డీలర్‌), గొట్టం వేణుగోపాల్‌రెడ్డి, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️