కార్మికులు అంటే అలుసా..?

Dec 22,2023 23:06

కార్పొరేషన్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిఐటియు నాయకులు

        అనంతపురం కార్పొరేషన్‌ : మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మరోసారి అధికారులు ఒంటెత్తు పోకడలు బహిర్గతమయ్యాయి. సాక్షాత్తు మున్సిపల్‌ పరిపాలన శాఖ డైరెక్టర్‌ కోటేశ్వరరావు కమిషనర్లను కార్మిక సంఘాలతో చర్చించి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కౌన్సిల్‌ హాలులో అదనపు కమిషనర్‌ రమణారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రధాన కార్మిక సంఘమైన సిఐటియును ఈ సమావేశానికి ఆహ్వానించకుండా అధికారులు సమావేశం నిర్వహించారు. అవుట్‌సోర్సింగ్‌ కార్మిక సమస్యలపై నిర్వహించే సమావేశానికి కార్పొరేషన్‌లో ఉన్న రెగ్యులర్‌ పారిశుధ్య కార్మికులను సమావేశ హాల్లోకి పిలుచుకెళ్లారు. అక్కడ కార్మికులకు పనిముట్లు హెచ్‌ఆర్‌ఎ, సరెండర్‌ లీవు బకాయి వేతనాలు ముట్టినట్లుగా వారితో సంతకాలు తీసుకున్నట్టు కార్మిక సంఘం నేతలు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు కార్పొరేషన్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అప్పటికే సమావేశం ముగించుకుని వెళ్తున్న అధికారులను నాయకులు అడ్డుకున్నారు. కార్మికులతో బలవంతంగా సంతకాలు తీసుకున్న రిజిస్టర్‌ను చింపివేశారు. అధికారుల ఒంటెద్దు పోకడలు నశించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఓ వైపు మున్సిపల్‌ పరిపాలన శాఖ డైరెక్టర్‌ సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడుతుండగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడంపై సిఐటియు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిఐటియు కార్మిక సంఘం నేతలు ఎటిఎం.నాగరాజు, మల్లికార్జున, సంజీవ రాయుడు, తిరుమలేశు, ఎర్రిస్వామి, నల్లప్ప, ఓబుళపతి, ముత్తురాజు తదితరులు అధికారులు సమస్యల పరిష్కారంపై ప్రశ్నిస్తారన్న ఉద్ధేశంతో సిఐటియు నాయకులను సమావేశానికి ఆహ్వానించలేదన్నారు. హెచ్‌ఆర్‌ఎ, సరెండర్‌ లీవు బకాయిలు, యూనిఫామ్‌, పనిముట్లు ముట్టినట్లుగా సంతకాలు తీసుకోవడం వెనుక అధికారుల ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. అనేక సమస్యలతో మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ పారిశుధ్య కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, తక్షణం వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు.

➡️