కష్టాలు కలిమి..కొలిమితో చెలిమి..

Feb 5,2024 22:21
కష్టాలు కలిమి..కొలిమితో చెలిమి..

ప్రజాశక్తి-గంగవరం: కొలిమి పనే వారికి బ్రతుకుదెరువు. కడు పేదరికంతో ఊరుగాని ఊర్లు తిరుగుతూ సంచరిస్తున్నారు. రెక్కాడితేగానీ దొక్కాడని పరిస్థితి. కోడి కూసింది మొదలుకొని రెక్కల కష్టం చేస్తేనే వారికి బుక్కెడు బువ్వ. కొలిమిలో ఇనుపకడ్డీని సానదీసి తమ చెమటను దారబోసి గ్రామ శివార్లే ఆవాసాలుగా రోజుకోఊరు తిరుగుతున్నారు. మహారాష్ట్రకు చెందిన బాబూలాల్‌ కుటుంబం చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరిస్తూ కొలిమిపని చేసుకుంటూ జీవిస్తున్నారు. సోమవారం గంగవరం మండలంలో ఆ కుటుంబ సభ్యులు కొలిమి పని చేస్తూ మొచ్చు పారలు, కొడవళ్లు, గొడ్డళ్లు తయారు చేస్తూ కనిపించారు. తాము ఉన్న ప్రాంతంలో జీవనోపాధి లేక కుటుంబాన్ని వెంటబెట్టుకొని ఇలా చేతి వృత్తిపై ఆధారపడి వివిధ రాష్ట్రాలో తిరుగుతూ బతుకు వెళ్లదీస్తున్నట్లు వాపోయారు. రాత్రి వేళల్లో ఉండటానికి చోటు లేక వృక్షాల కిందనే ఉండి మరునాడు మరో ప్రాంతానికి వెళుతున్నట్లు వివరించారు.. ఇద్దరు కుమారులు, ఒక కుమారై సంతానం ఉండగా.. తన పెద్దకుమారుడు, భార్యను వెంటబెట్టుకొని కొలిమిపని చేసుకుంటున్నట్లు చెప్పారు. మిగిలిన ఇద్దరు పిల్లలను స్వగ్రామంలో విడిచిపెట్టి వచ్చేశామని, ఒక్కరోజు సంపాదన లేకపోరునా పొట్ట గడవదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడాధిలో రెండు నెలలు మాత్రమే వచ్చిన సంపాదనతో స్వగ్రామంలో గడుపుతున్నామని, గత్యంతరం లేకనే ఇలా సంచరించాల్సి వస్తోందని ఒకింత భావోద్వేగానికి లోనైయ్యారు. అది విన్న స్థానికులు వారి పట్ల సానుభూతిని వ్యక్తం చేశారు. మరికొందరు తోచిన సాయంగా పూట భోజనం ఇచ్చారు.

➡️