కవిత అరెస్టు ఎన్నికల స్టంట్‌: సీఎం రేవంత్‌ రెడ్డి

revanth reddy oath

హైదరాబాద్‌ : కవిత అరెస్టు ఎన్నికల స్టంట్‌ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు.’మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి’ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లామని.. ప్రస్తుతం తాము ప్రజల్లోనే ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా కవిత అరెస్టు విషయంపై సీఎం స్పందించారు. ”కవిత అరెస్టును కేసీఆర్‌ ఖండించలేదు. ఆయన మౌనాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి. ఆమె అరెస్టుపై కేసీఆర్‌, నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు. దాని వెనక వ్యూహం ఏంటి? గతంలో ఈడీ వచ్చాక మోడీ వచ్చేవారు.. కానీ నిన్న మాత్రం మోడీ, ఈడీ కలిసే వచ్చారు. కేసీఆర్‌ కుటుంబం, బిజెపి మద్యం కుంభకోణాన్ని నిరంతర ధారావాహికలా నడిపించారు. ఈ అరెస్ట్‌ బిజెపి, బిఆర్‌ఎస్‌ ఆడుతున్న డ్రామా. ఎన్నికల షెడ్యూల్‌కు ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? 12 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయి. మమ్మల్ని దెబ్బతీసేందుకు బిజెపి-బిఆర్‌ఎస్‌ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. ఈ అరెస్టు ఎన్నికల స్టంట్‌. రాష్ట్రానికి మోడీ చేసిందేమీ లేదు. ప్రధానిగా ఆయన చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదు. తెలంగాణను అవమానించిన మోడీకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదు” అని రేవంత్‌ మండిపడ్డారు.

➡️