కరువు…ఏకరువు!

ఎన్నికలొస్తున్నారు..రోడ్లేయండి మహాప్రభోకలెక్టర్‌ను శరణుజొచ్చిన ఎంపిపి, జడ్‌పిటిసిలుఎంపీలు, ఎమ్మెల్యేలు డుమ్మానాలుగు తీర్మానాలు ఏకగ్రీవంప్రజాశక్తి – కడప ప్రతినిధిఉమ్మడి వైఎస్‌ఆర్‌ జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం కరువు పరిస్థితులపై ఏకరువు పెట్టింది. శనివారం చైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 2023-24 ఖరీప్‌, రబీ సీజన్‌ల్లో వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు హాజరై అర్థవంతమైన చర్చ చేసి, జిల్లాకు రావాల్సిన నిధులు, ఇతర వ్యవహారాలను రాబట్టుకోవాలి. ఇటువంటి కనీస ప్రయత్నం చేయకుండా తుపాన్‌, వరదలు, వర్షాభావానికి రైతులను గాలికొదిలేయడం బాధ్యతా రాహిత్యమనే చెప్పాలి. ప్రతిపక్ష టిడిపి ఎంఎల్‌సి, జడ్‌పిటిసి, ఎంపిపిలకు అవకాశం దొరికినప్పటికీ సమర్థవంతమైన పాత్ర పోషించకపోవడం మైనస్‌గానే చెప్పుకోవాలి. కడప, రాజంపేట ఎంపీలు, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేల్‌ ఎమ్మెల్యేలకు సైతం ప్రజాసమస్యలు, బాధలు, పట్టలేదు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ వీరపునాయునిపల్లి జడ్‌పిటిసి తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. టిడిపి ఎంఎల్‌సి రామగోపాల్‌రెడ్డి స్పందిస్తూ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడానికి గల కారణాలేమిటని, అధికారుల తప్పిదమా, ప్రభుత్వ తప్పిదమా అనేది తేల్చాలని నిలదీయడంతో గందరగోళం నెలకొంది. పొరుగు జిల్లాలైన కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ గైడ్‌లెన్స్‌లోని ఐదు పారా మీటర్లలో మూడు పారామీటర్లు సరిపోలితే కరువు ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఫలితంగా పంట రుణాల రీషెడ్యూల్‌ కావడం, ఉపాధి పనుల సంఖ్య పెరగడం వంటి ఫలితాలు లాభించే అవకాశం ఉందన్నారు. దీనిపై డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఇన్సూరెన్స్‌ కోసం ధర్నాలు చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కమలాపురం ఎంఎల్‌ఎ రవీంద్రనాధరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురిశాయన్నారు. జిల్లా వ్యవసాయఅధికారి మాట్లాడుతూ జిల్లాలో డ్రైస్పెల్స్‌ కారణంగా రైతులు సకాలంలో విత్తలేక పోయారన్నారు. కడప, కమలాపురం, జమ్మలమడుగు, పులివెందుల డివిజన్లలో 11 వేల హెక్టార్లలో వర్షాభావం కొనసాగుతోందన్నారు. తాజా మిచౌంగ్‌ తుపాన్‌ కారణంగా 26 మండలాల పరిధిలోని 119 గ్రామాల్లో పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు అందగానే పూర్తిస్థాయి నివేదికను రూపొందించి, ఆర్‌బికెల్లో మూడ్రోజులపాటు ప్రదర్శనకు ఉంచుతామన్నారు. రైల్వేకోడూరు ఎంఎల్‌ఎ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు తుపాన్‌ బారిన పడుతుండడం పరిపాటిగా మారిందని, ఎన్యూమరేషన్‌ విషయంలో 30 శాతం నిబంధన మేర పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఇ-క్రాప్‌ చేయని పంట నష్టాలను కూడా ఎన్యుమరేషన్‌ చేసి వివరాలను దగ్గర ఉంచుకోవాలని సూచించారు. చక్రాయపేట జడ్‌పిటిసి మాట్లాడుతూ వరద పరిహారం చెల్లించడంపై తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. రుణమాఫీ చేసే అవకాశాన్ని ప్రతిపాదించాలని చెప్పారు. కలెక్టర్‌ విజరురామరాజు స్పందించి ఎన్యూమరేషన్‌ చేసిన అనంతరం ఆర్‌బికెల దగ్గర మూడ్రోజులపాటు ప్రదర్శనకు ఉంచాలని చెప్పారు. వేంపల్లి ఎంపిపి రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ వేంపల్లి ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని, ఆధునిక పరికరాల కొరత కారణంగా కంటి, గర్భిణీ సంబంధిత సమస్యలకు ఆపరేషన్‌ చేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఎంఎల్‌సి రామ్‌గోపాల్‌రెడ్డి స్పందించి రాజంపేట ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్‌ రోగులు పెద్దసంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోందని, డయాలసిస్‌ పరికరాలతో కూడిన ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. బి.మఠం జడ్‌పిటిసి మాట్లాడుతూ డ్వామా ఆధ్వర్యంలోని రూ.40 కోట్లతో గ్రావెల్‌రోడ్లు నిర్మించాలని, త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్‌ స్పందించి మండలానికి రూ.50 నుంచి రూ.60 లక్షల వరకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. గ్రామాలకు వెళ్లడానికి రోడ్లు సక్రమంగా లేవని, ఎన్నికల నేపథ్యంలో పల్లెలకు వెళ్తే నిలదీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చక్రాయపేట జడ్‌పిటిసి స్పందిస్తూ చిన్నచిన్న సమస్యల కారణంగానే పల్లెలకు వెళ్లలేకపోతున్నామని, కలెక్టరే స్వయంగా రోడ్లు పలు ఇతర సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. బి.మఠం ఎంపిపి వీర నారాయణరెడ్డి మాట్లాడుతూ రెండు నెలల్లో ఎన్నికలొస్తున్నాయని, రేకులకుంటలో 300 ఇళ్లస్థలాల స్వీకరణకు లబ్ధిదారులు నిరాకరిస్తున్నారని, ఇతర ప్రాంతానికి ప్లాన్‌ మార్చాలని విజ్ఞప్తి చేశారు. బద్వేల్‌-ముత్తుకూరు, బద్వేల్‌-బి.మఠం, మైదుకూరు- వెంకటాపురం టిజిపి రహదారి సమస్య, నీటి వృథా చేయడం వంటి అంశాల ఎంపిపి, జడ్‌పిటిసి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం వరద పరిహారం చెల్లింపు, జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, అరటికి బీమా సదుపాయం, నరేగాలో గ్రావెల్‌రోడ్ల నిర్మాణానికి సంబంధించిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపిపిలు, జడ్‌పిటిసిలు, ఎంఎల్‌సి రమేష్‌కుమార్‌యాదవ్‌, పలు కార్పొరేషన్ల చైర్మన్‌లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

➡️