కమ్యూనిటీ స్థలంపై కన్ను

Jan 30,2024 21:17

ప్రజాశక్తి – పాలకొండ : డివిజన్‌ కేంద్రమైన పాలకొండ పట్టణంలో స్థలాల విలువ విపరీతంగా పెరిగిపోయాయి. సెంటు స్థలం లక్షల్లో విలువ పలుకుతుంది. దీంతో కొంతమంది వ్యక్తులు ఖాళీ స్థలాలపై కన్నేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా కాజేయడానికి వెనుకాడడం లేదు. విలువైన స్థలలాను అక్రమంగా తీసుకోవడానికి కొంతమంది వ్యక్తులు వెనుకాడడం లేదు. అధికారులు ఉదాసీనతతో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. నగర పంచాయతీ పరిధిలో గల నాలుగో వార్డులో సర్వేనెంబర్‌ 19/1 లో నీలమ్మ కాలనీలో సామాజిక అవసరాలకు కేటాయించిన 5సెంట్ల స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిపై అధికారులు మాత్రం మొదట్లో స్పందించలేదు. అక్కడున్న స్థానికుల నుంచి తిరుగుబాటు రావడంతో అధికారులు స్పందించే పరిస్థితి కనబడుతుంది. ఈ స్థలం చేతులు మారినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీ వాసుల కోసం విడిచిన స్థలాన్ని కాపాడాలని అదికారులను కోరుతున్నారు. లేని పక్షంలో కోర్టును ఆశ్రయించి న్యాయం జరిగే వరకూ పోరాడతామని కాలనీ వాసులు చెబుతున్నారు. ఈ స్థలం వెనక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి సంబంధించిన స్థలాన్ని కూడా కబ్జా చేసి గోడ నిర్మిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.పరిశీలన చేస్తా : సర్వేశ్వర్రావు కమిషనర్‌దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తానని కమిషనర్‌ సర్వేశ్వర్రావు అన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చింది. వారి దగ్గరున్న పత్రాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

➡️