‘కడప ఉక్కు’ కోసం నినదించిన డివైఎఫ్‌ఐ

ప్రజాశక్తి – కడప అర్బన్‌ విభజన చట్టంలో రాష్ట్ర హక్కు అయిన కడప ఉక్కును కేంద్ర ప్రభుత్వం విస్మరించడాన్ని నిరసిస్తూ గురువారం దేశ రాజధాని ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద డివైఎఫ్‌ఐ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజన హామీ అయిన కడప ఉక్కును పూర్తిగా విస్మరించిందన్నారు. చట్టబద్దంగా రాసుకున్న కడప ఉక్కు హామీని ఎందుకు అమలు చేయడం లేదని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. కనీసం చివరి బడ్జెట్‌ సమావేశాల్లో అయిన పార్లమెంటులో కడప ఉక్కు నిధులు కేటాయిస్తారని అనుకుంటే బిజెపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరో సారి మొహానికి మసి పూసిందన్నారు. రాష్ట్ర అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి రెండు గళమెత్తకపోవడం సిగ్గుచేటు అన్నారు. యువత ఆశ కడప ఉక్కు అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వేలల్లో లభిస్తాయని తెలిపారు. కరువు కోరల్లో ఉన్న రాయలసీమకు ఉపశమనం ఉద్యోగాల రూపంలో లభిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కడప ఉక్కు విచిత్ర పరిస్థితి అని, మూడు శిలా ఫలకాలు ముగ్గురు ముఖ్యమంత్రులు వేసిన చరిత్ర ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికలలో ఎవరు కడప ఉక్కు పరిశ్రమ పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తారో, కేంద్రాన్ని నిలదీసి కడప ఉక్కుకు నిధులు రాబడుతారో యువత వారికే మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. లేకుంటే ఓటు ద్వారా తగిన రీతిలో బుద్ది చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బ నరసింహ పాల్గొన్నారు.

➡️