కందుకూరు బరిలో ‘కోటపాటి’..?

Jan 3,2024 20:09
చంద్రబాబును కలిసిన జనార్ధన్‌రావు

చంద్రబాబును కలిసిన జనార్ధన్‌రావు
కందుకూరు బరిలో ‘కోటపాటి’..?
ప్రజాశక్తి-కందుకూరు వచ్చే శాసనసభ ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ టిడిపి టికెట్‌ కోసం మరో వ్యక్తి రంగంలోకి దిగారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌ వెళ్లి పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును కలిశారు. ఆయన పేరు కోటపాటి జనార్ధన్‌రావు, వ్యాపారవేత్త.. హైదరాబాద్‌, బెంగళూరు నగరాలలో ఆయనకు పలు కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయి. జనార్ధన్‌రావుది ప్రకాశం జిల్లా, కనిగిరి నియోజకవర్గం. పామూరు మండలంలోని బొట్లగూడూరు ఆయన స్వగ్రామం. కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం మండలానికి అనుకునే పామూరు మండలం ఉంది. పొరుగు నియోజకవర్గం వారైనప్పటికీ కందుకూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉద్యోగులతో,ఉపాధ్యాయ సంఘాలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఆయన ఉపాధ్యాయ సంఘాల సభలు, సమావేశాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. కందుకూరు నియోజకవర్గంపై దృష్టిసారించిన జనార్ధన్‌రావు ప్రస్తుతం పట్టణంలో సొంత ఇల్లు కూడా నిర్మిస్తున్నారు. ఆయన కుటుంబానికి రాజకీయాలు కొత్తవి కావు. ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తులే పలుమార్లు బోట్లగూడూరు గ్రామపంచాయతీ సర్పంచ్‌గా గెలిచారు. పూర్వ ఆశ్రమంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న జనార్ధన్‌రావు కుటుంబం దశాబ్ధ కాలంగా టిడిపిలో కొనసాగుతుంది. కొన్ని నెలలుగా కందుకూరు నియోజకవర్గంలోని కొందరు టిడిపి నాయకులు, కార్యకర్తలతో జనార్ధన్‌రావు సంబంధాలు నడుపుతున్నారు. ఎంఎల్‌సిగా ఎన్నికైన కంచర్ల శ్రీకాంత్‌ మద్దతు జనార్ధన్‌రావుకు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. కంచర్ల శ్రీకాంత్‌ కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. కంచర్ల శ్రీకాంత్‌ కు నారా చంద్రబాబు నాయుడు ,నారా లోకేష్‌ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఉలవపాడు లోని కొందరు కార్యకర్తలతోనూ జనార్ధన్‌రావు రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నారు. జనార్ధన్‌రావు చంద్రబాబు నాయుడు ని కలవడంతో నియోజకవర్గంలోని టిడిపి కార్యకర్తల్లో అయోమయ పరిస్థితిలు నెలకొన్నాయి. ఈ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జిగా ఇంటూరి నాగేశ్వరరావు పని చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు అత్యధికులు ఇంటూరి నాగేశ్వరరావు వెంట నడుస్తున్నారు. ఇంటూరి నాగేశ్వరరావుకు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ లభిస్తుందని నమ్మకంతో టిడిపి కార్యకర్తలు ఉన్నారు. అయినా మరోవైపు మాజీ శాసనసభ్యుడు పోతుల రామారావు మరోసారి సైకిల్‌ అభ్యర్థిగా ఈ నియోజకవర్గ నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారని ప్రచారం లేకపోలేదు. ఇప్పుడు మూడో పోటీ దారుగా జనార్ధన్‌రావు రంగప్రవేశం చేశారు. దీంతో టిక్కెట్లు ఎవరిని వరిస్తోందో వేచి చూడాల్సి ఉంది.

➡️