‘కంటి పరీక్షలు చేసుకొంటే బాగుంటుంది’

ప్రజాశక్తి – వేంపల్లె మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జనాలు లేరని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారని, కాబట్టి టిడిపి నాయకులు ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు పథకంలో ఆసుపత్రికి వెళ్లి కంటి పరీక్షలు చేసుకొంటే జనాలు ఉన్న విషయం తెలుస్తుందని జడ్‌పిటిసి రవికుమార్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ చంద్ర ఓబుల్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ సిఎం యాత్రలో 700 మంది కంటే ఎక్కువగా లేరని చెప్పడం టిడిపి నాయకుల అవివేకానికి నిదర్శనం అన్నారు. బస్సు యాత్రకు వేంపల్లెలో 12 వేలు మంది వచ్చారని ఇంటెలిజెన్స్‌ అధికారులు కూడా నివేదికలు ఇచ్చారని పేర్కొన్నారు. బస్సు యాత్ర పార్టీ కార్యక్రమాన్ని చెప్పారు. దళితులకు వైసిపి ఎక్కడా అవమాన పరచలేదని చెప్పారు. కళ్ళు లేని కబోది లాగా టిడిపి నాయకులు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహించే బస్సు యాత్రలో ఎక్కడా ఎంపిపిలను, సర్పంచులను బస్సులో ఎక్కించడం లేదని చెప్పారు. సిఎం, ఎంపిలను క్షమాపణలు చెప్పాలని కోరడం ఆరోపణలు చేసిన టిడిపి నాయకులకు అర్హత లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటో కాల్‌ ను విస్మరించలేదని చెప్పారు. ఇడుపులపాయ నుంచి ప్రోద్దుటూరు వరకు జనాలు సిఎంకు నిరాజనాలు పలికారని చెప్పారు. లేని పోని ఆరోపణలు చేయడం తగదని చెప్పారు. వైసిపి దళితులకు మొదట ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు చెప్పారు. అభివద్ధిపై విమర్శలు చేయడం తగదని చెప్పారు. పనులు జరిగే సమయంలో కొన్ని ఇబ్బందులు జరగడం సహజమని వాటిని భూతద్దంలో చూపిం చడం అలవాటు అయ్యిందని చెప్పారు. ఎంపిపి లక్ష్మి గాయత్రీ మాట్లాడుతూ సిఎం, ఎంపీి ఇద్దరూ దళిత ఎంపిపిని అవమాన పరిచినట్లు టిడిపి నాయకులు ఆరోపించడం సిగ్గుచేటన్నారు. బస్సు యాత్ర ప్రారంభం సమయంలో ఇడుపులపాయలో లేక పోవడం వల్లనే తాను బస్సులో ఎక్కలేక పోయానని చెప్పారు. టిడిపి నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌సి కాలనీ వద్ద తనను చూసిన సిఎం బస్సును కొద్ది సేపు ఆపడం జరిగిందని చెప్పారు. దళితులకు అనేక పదవులు సిఎం జగన్‌ ఇచ్చారని విషయాన్ని టిడిపి నాయకులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. అరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని చెప్పారు. విలేకరుల సమావేశంలో సివిల్‌ సప్లరు డైరెక్టర్‌ షబ్బీర్‌ వలి, హజ్‌ హౌస్‌ డైరెక్టర్‌ మునిర్‌, మాజీ ఉపసర్పంచ్‌ మునీర్‌, ఎంపిటిసిలు రహంతుల్లా ఖాన్‌, కటిక చంద్ర శేఖర్‌, భారతి, శ్రీనివాసులు, ఖదీర్‌, నిసార్‌ బాషా, మణి గోపాల్‌ రెడ్డి, జయరాం, హబిబుల్లా పాల్గొన్నారు.

➡️