ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన పూర్తి : జెసి

ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలను పక్కాగా పరిశీలిస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ రాజకీయ పార్టీ నాయకులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లాలో ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన అంశంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఓటరు జాబితా ఇంటింటి పరిశీలన దాదాపు పూర్తి అయిందని తప్పులు లేని స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనకు ప్రతి ఒక్కరూ సహకరిం చాలన్నారు. ఓటరు జాబితాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటి కప్పుడు రాజకీయ పార్టీల నాయకులకు తెలియజేస్తున్నామని ఇందులో ఎటువంటి సందేహాలున్న వెంటనే తెలియజేయాలన్నారు. డెత్‌, షిఫ్టెడ్‌, రిపీటెడ్‌ ఓట్లను ఒకటికి రెండుసార్లు మరలా పరిశీలించడం జరిగిందని డెత్‌ ఓటర్లకు సంబంధించి డెత్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో 18 ఏళ్లు పూర్తయిన వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఎన్‌రోల్‌ చేస్తామన్నారు. 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండే వారందరినీ ఓటరుగా ఫార్మ్‌ 6 ద్వారా ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా ఓటర్‌గా నమోదు చేసుకోవాలన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు గతంలో డిలీట్‌ అయిన ఓట్లను బిఎల్వోల ద్వారా పోలింగ్‌ స్టేషన్‌ ల వారీగా పరిశీ లించడం జరిగిందన్నారు. ఈనెల 9వ తేదీన అన్ని పోలింగ్‌ కేంద్రాలలో బిఎల్‌ఓ లను అందుబాటులో ఉంచి ఓటర్‌ ఎన్రోల్‌ చేసుకోవడం జరుగుతుందన్నారు. సమస్యాత్మక అతి సమశ్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో మహిళా పోలీసులను నియమించి మహిళా ఓటర్లకు సహకరించడం జరుగుతుందన్నారు. ఓటర్‌ జాబితాకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా వెంటనే పేపర్‌ రూపంలో తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి, రాజంపేట, ఆర్డీఓలు రంగస్వామి, రామకృష్ణారెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️