ఒడిశా దూకుడును పట్టించుకోని ఆంధ్రా అధికారులు

Mar 30,2024 20:55

సాలూరురూరల్‌ : 15 ఏళ్లుగా వివాదాస్పద గ్రామాల్లోకి ఒడిశా అధికారులు అభివృద్ధి, సంక్షేమం పేరిట అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నా ఆంధ్రా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు వంతాల సుందరరావు, తాడంగి సన్నం విమర్శించారు. మండలంలోని ఎగువసెంబి, దిగులుసెంబి, ధూళిభద్రలో ఒడిశా అధికారులు అక్రమంగా మైనింగ్‌ తవ్వకాలకు వచ్చే గిరిజనులు అడ్డుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తమ ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలు మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి ప్రయత్నాలు గిరిజనులకు సంబంధించి గ్రామసభల ద్వారా గానీ, అనుమతులు తీసుకోకుండా వారికి నచ్చిన విధంగా నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి ఒక విధానం ఉంటుందని, దాన్ని కూడా పాటించకుండా వారికి నచ్చినట్టు ప్రవర్తించడం ఎంత సమంజసమని ప్రశ్నించారు. ఇటువంటి చర్యలను గిరిజన సంఘాలుగా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఎన్నో తరాలుగా పోడు వ్యవసాయం చేసుకొని గిరిజనులు జీవం సాగిస్తున్నారని, అటువంటి భూములను అభివృద్ధి పేరిట అక్రమంగా ప్రభుత్వాలు గిరిజనుల నుంచి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. దీనికి నిరసనగా గిరిజనమంతా ఏకమై పోరాడుతామని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మైనింగ్‌ నిమిత్తం వచ్చిన లారీలను గిరిజనులమంతా ఒక్కటై వెనక్కి పంపిస్తామన్నారు. ఈ ప్రాంతమంతా పీసా చట్టం అమలలో ఉందని, అయినా దౌర్జన్యంగా గిరిజనుల భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి చర్యలను ఆంధ్రా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, నాయకులు వంతల సుందర్రావు, టాడంగి సన్నం, మహేష్‌, కొమ్ములు, మంజు, సుభ తదితరులు పాల్గొన్నారు.

➡️