అసెంబ్లీలో కోరం లేదు.. మండలిలో మంత్రులు లేరు

– చివరిరోజూ సమావేశాల్లో కొనసాగిన నిర్లిప్తత

-అసెంబ్లీ నిరవధిక వాయిదా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో చివరిరోజైన గురువారం కూడా సభ్యులలో నిర్లిప్తత కొనసాగింది. ఉభయ సభల్లోనూ సభ్యుల హాజరు చాలా తక్కువగా కన్పించింది. శాసనసభ ప్రారంభమయ్యే సమయానికి కేవలం ఐదారుగురు సభ్యులు మాత్రమే సభలో ఉన్నారు. టిడిపి ఉప నాయకులు కె అచ్చెన్నాయుడు సభలో కోరం లేదు చూడండి అని చెప్పడం వినిపించింది. దీంతో సభ నిర్ణీత సమయం కన్నా కొద్దిసేపు ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రభుత్వ కార్యక్రమాలు ముగిసిన వెంటనే సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన సభలోనూ సభ్యుల హాజరు పలుచగా కనిపించింది. దీంతో కొద్దిసేపు నామమాత్రంగా సభను నిర్వహించి, నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. నాలుగు రోజుల సమావేశాల్లోనూ సభలో కూర్చొన్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రధానంగా అధికార పక్ష సభ్యుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కువ మంది సమావేశాలకు హాజరు కాకపోవడం, హాజరైనా సభల్లో కూర్చొని చర్చల్లో పాల్గనకుండా బయటకు వెళ్తున్న పరిస్థితి ఉభయ సభల్లో నెలకొంది. గురువారం మధ్యాహ్నం శాసనమండలిలో బడ్జెట్‌పై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రసంగించే సమయానికి కేవలం 15 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మండలిలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చకు అనుమతి కోరి కొద్దిసేపటికి మండలి నుంచి శాసనసభకు వెళ్లిపోయారు. అయితే మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి అమర్‌నాథ్‌, ఇతర మంత్రులు బడ్జెట్‌పై చర్చ సమయంలో సభలో లేకుండాపోయారు. దాదాపు 13 మంది సభ్యులు మాట్లాడగా ఒక్క మంత్రి కూడా ఈ సభలో లేకపోవడం గమనార్హం. శాసనసభలో మొదటిరోజు మినహా మిగతా మూడు రోజులు సస్పెన్షన్ల పర్వం కొనసాగింది. మండలిలో సస్పెన్షన్లు లేకున్నా సభ్యుల హాజరు శాతం చాలా తక్కువగా ఉంది. శాసనసభతో పోల్చితే మండలిలో హాజరు 50 శాతం వరకు ఉంది. చర్చల్లో అధికార పార్టీతో పాటు టిడిపి, పిడిఎఫ్‌ సభ్యులు ఎక్కువగా చర్చలో పాల్గన్నారు. మొత్తంగా నాలుగు రోజుల కాలంలో శాసనసభలో 10 గంటల రెండు నిమిషాలు సభా కార్యకలాపాలు జరగ్గా, 9 బిల్లులు ఆమోదించారు. 20 మంది సభ్యులు ప్రసంగించారు. శాసనసభలో వైసిపికి 151 మంది, టిడిపికి 22, జనసేన 1, ఖాళీ ఒక్కటి ఉన్నట్టు సభ అనంతరం స్పీకరు తమ్మినేని సీతారాం ప్రకటించారు. అదే విధంగా శాసనమండలిలో 9 గంటల 15 నిమిషాలు సభ కార్యకలాపాలు జరగ్గా 9 బిల్లులు ఆమోదించారు. ఆరు వాయిదా తీర్మానాలను ప్రతిపాదించారు. 17 ప్రత్యేక ప్రస్తావనల ద్వారా వివిధ అంశాలను సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. సభలో వైసిపికి 35, టిడిపి 8, పిడిఎఫ్‌ 2, ఇండిపెండెంట్‌లు 4, నామినేటెడ్‌ 8, ఖాళీలు ఒక్కటి ఉన్నట్టు మండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేను రాజు ప్రకటించారు.

➡️