ఏజెన్సీ ఉత్పత్తులకు అధిక ధర వచ్చేలా చర్యలు

మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ప్రజాశక్తి-రంపచోడవరం

ఏజెన్సీలోని ఉత్పత్తులు తక్కువ ధరకు కొనుగోలు చేసి, మైదాన ప్రాంతంలో చాలా ఎక్కువ రేట్లకు అమ్మి అధిక లాభాలు పొందుతున్నారని, ఈ ఉత్పత్తులకు ఏజెన్సీలోనే ఎక్కువ ధర వచ్చే విధంగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే ఆదేశించారు. తాటిచెట్లు, పనస పండులు, కర్ర పెండ్లం ద్వారా వివిధ రకాల ఆహార పదార్థాలు తయారీకి సంబంధించి మండలంలోని పందిరి మామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో ఏడు మండలాలకు సంబంధించిన వ్యవసాయ, ఉద్యానవన మండల అధికారులు, ఆయా శాఖల సచివాలయ అసిస్టెంట్లతో శుక్రవారం సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐటిడిఎ పిఒ మాట్లాడుతూ తాడిచెట్టు నుండి వచ్చే నీరా ఒక లీటర్‌ రూ.25కు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రాంగణంలో నీరా ద్వారా తాటిబెల్లం కూడా తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏజెన్సీలోని చదువుకున్న గిరిజన యువతీ యువకులకు చిన్న చిన్న యూనిట్లు ఏర్పాటు చేసుకునే విధంగా సబ్సిడీపై ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్ర కో-ఆర్డినేటర్‌ లలిత కామేశ్వరి, కెవికె సీనియర్‌ సైంటిస్టులు కె.రాజేంద్రప్రసాద్‌, పిసి వెంకయ్య, పిహెచ్‌ఓ కె.చిట్టిబాబు, ప్రాజెక్ట్‌ అగ్రికల్చరల్‌ అధికారి ఎల్‌.రాంబాబు, అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సిహెచ్‌కెవి.చౌదరి, యం.సావిత్రి పాల్గొన్నారు. అనంతరం నీరా, తాటి బెల్లం తయారు చేసే ప్లాంట్‌ను సందర్శించారు.

➡️