ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి..

పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు

 

ప్రజాశక్తి-శింగనమల

‘ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. కెజిబివిలోకి మాత్రం అనుమతించేది లేదు..’ అంటూ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయం ఎస్‌ఓ తల్లిదండ్రులకు హుకుం జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం సెలవు కావడంతో మండల కేంద్రంలోని కెజిబివిలో చదువుతున్న విద్యార్థులను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు వచ్చారు. అయితే అక్కడున్న ఎస్‌ఒ మాత్రం తల్లిదండ్రులను లోనికి అనుమతించేది లేదని, వెనక్కి వెళ్లాలని హుకుం జారీ చేశారు. చేసేది లేక తల్లిదండ్రులు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ నెలకోసారి తమ పిల్లలను చూసేందుకు వస్తామన్నారు. నెలకు ఒకసారి కూడా తమ పిల్లలను చూడకుంటే ఎలా అని వాపోయారు. ఇలా అనుమతించకపోతే తమ పిల్లలు ఎలా ఉన్నారో తమకు ఎలా తెలుస్తుందన్నారు. అలాగే తమ పిల్లలకు భోజనం కూడా సరిగా పెట్టడం లేదని ఆందోళన విద్యార్థులు వాపోతున్నారన్నారు. ఈ సమయంలో కనీసం తాము నెలకొసారి తీసుకొచ్చిన అన్నం కూడా తినే సౌకర్యం కల్పించకపోతే ఎలా అని నిలదీశారు. అయినా ఎస్‌ఓ ఏమాత్రం స్పందించకపోవడం బాధాకరం. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పాఠశాల వద్దకు చేరుకుని వివరాలు ఆరాతీయగా ఎస్‌ఓ దురుసుగా ప్రవర్తించారు. అంతేగాకుండా ‘ఫొటోలు తీసుకుంటారా.. వార్తలు రాస్తారా.. రాసుకోండి..’ అంటూ గద్దించారు. తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో ఎట్టకేలకూ సాయంత్రం పాఠశాలలోకి తల్లిదండ్రులను అనుమతించారు.

➡️