ఎరువులు వాడకంపై అవగాహన

Feb 2,2024 21:41
ఫొటో : మాట్లాడుతున్న సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మీ మాధవి

ఫొటో : మాట్లాడుతున్న సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మీ మాధవి
ఎరువులు వాడకంపై అవగాహన
ప్రజాశక్తి-అనంతసాగరం : అనంతసాగరం మండలం 1వ గ్రామ సచివాలయంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సౌజన్యంతో జిల్లా వనరుల కేంద్రం నెల్లూరు వారు రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మీ మాధవి మాట్లాడుతూ వరిలో కాంప్లెక్స్‌ ఎరువులతో పాటుగా వాడడం వల్ల నేలలో మోతాదుకు మించి భాస్వరం ఉండడం వల్ల మొక్కకు కావాల్సిన సూక్ష్మపోషకాలు నేలలో ఉన్నప్పటికీ అందుబాటులోకి రావన్నారు. అలాగే అన్ని రకాల పోషకాలు సమపాళ్లలో వాడినప్పుడు మొక్కల్లో పెరుగుదల ఉండడంతో తెగుళ్లు పురుగులు తక్కువగా ఆశిస్తాయన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారివాసు మాట్లాడుతూ నాటే దశ నుంచి కోత దశ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి వివరించారు. ముఖ్యంగా ముదురు నారు నాటేటప్పుడు ఒక కుదురుకు ఎక్కువ సంఖ్యలో మొక్కలు పెట్టుకొని ఎక్కువ లోతు లేకుండా నాటాలన్నారు. నాటిన దశ నుంచి 45 రోజుల లోపల అన్ని రకాల ఎరువులు వేయడం పూర్తి చేయాలని, ఆ తర్వాత వేయడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలియజేశారు. కృషి విజ్ఞాన కేంద్రం పంటల ఉత్పత్తి అధికారి డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ వరిలో అజో స్పైరిలం, పిఎస్‌బి, కెఆర్‌బి జీవన ఎరువులను వాడడం వల్ల నేలలో వేసిన ఎరువులు మొక్కకు అందుబాటు రూపంలోకి త్వరగా వస్తాయని, పైరు మొత్తం మీద వేసే ఎరువులలో 25 శాతం తగ్గించి వాడుకునేలా చేస్తాయన్నారు. మండల వ్యవసాయాధికారి శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ వరిలో అగ్గి తెగులు నివారణకు నత్రజని ఎరువులు అధికంగా వాడడం ఒక కారణమని, కాబట్టి నత్రజని ఎరువులు సమపాళ్లలో వాడాలని, పైరులో ఆరుతడులు లేకుండా నీరు ఉంచుకోవాలని ఆకుమీద అగ్గి తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ఎకరానికి 120 గ్రాములు ట్రై సైక్లోజోల్‌ పిచికారి చేయాలని, మెడ విరుపు రాకుండా ఐసో ప్రోతయోలిన్‌ ఎకరానికి 330 ఎం.ఎల్‌. ముందు జాగ్రత్త చర్యగా పిచికారి చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో రాపూరు బాలకొండారెడ్డి, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌, బట్రెడ్డి కృష్ణారెడ్డి అనంతసాగరం గ్రామ వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌, షేక్‌ మై మున్నీసా, ఖాదర్‌ రెడ్డి, రత్నారెడ్డి, నర్సారెడ్డి, రఘురాం రెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.

➡️