ఎమ్మెల్సీ ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం

ఎమ్మెల్సీ ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం

సమావేశంలో మాట్లాడుతున్న వైసిపి నాయకులు బాబురెడ్డి

హిందూపురం : ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని వైసిపి నాయకులు చల్లాపల్లి బాబురెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ బుధవారం హిందూపురానికి వచ్చి తనపై చేసిన ఆరోపణలను బాబురెడ్డి ఖండించారు. గురువారం సాయంత్రం స్థానిక వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబురెడ్డి మాట్లాడారు. వైసిపి ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ అభివృద్ది కోసమే పని చేశానని అన్నారు. ప్రస్తుతం సైతం పార్టీ పెద్దలు చెప్పడంతోనే హిందూపురానికి వచ్చి నాయకులను సమన్వయం చేస్తు, పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నానని చెప్పారు. అయితే ఎమ్మెల్సీ ఇక్బాల్‌ ‘ బాబు రెడ్డి ఎవరు.. పార్టీకి అతనికి సంబంధం ఏమి’ అని మాట్లాడారన్నారు. ఎమ్మెల్సీ ఇంకా పోలీసు అధికారిగా ఉన్న సమయంలోనే పెనుగొండ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా పనిచేశానని గుర్తుచేశారు. తనను కలవడానికి వచ్చిన వారిని భయబ్రాంతులకు గురి చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యక్తిగతంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. ఈ విషయంపై తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో అందరిని సమన్వయం చేసుకొని, గెలుపే లక్ష్యంగా పనిచేసి, టిడిపికి కంచుకోటను బద్దలు కొడతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు వేణు రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ బలరామిరెడ్డి, జెకెసి జిల్లా కోఆర్డినేటర్‌, కౌన్సిలర్‌ మారుతీ రెడ్డి, కౌన్సిలర్‌ షాజియా, నాగేంద్రబాబు, పట్టణ ఏ, బి బ్లాక్‌ కన్వీనర్లు సిపిసి సాదిక్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️