ఎన్నికల అంశాలపై ఆర్‌ఒలకు అవగాహన

Mar 19,2024 22:54
ఎన్నికల అంశాలపై ఆర్‌ఒలకు అవగాహన

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌రిటర్నింగ్‌ అధికారులకు కలెక్టరేట్‌లో మంగళవారం ఎన్నిలకలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. సువిధ, ఎంసిసి, పిఒ, ఎపిఒ, ఒపిఒల శిక్షణ కార్యక్రమం, పోస్టల్‌ బ్యాలెట్‌ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాధవీలత, తొలుత ప్రిసైడింగ్‌ అధికారి, సహయ ప్రిసైడింగ్‌ అధికారి, ఇతర పోలింగ్‌ సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ సద్వినియోగం చేసుకోవడంలో నియామక ప్రక్రియ నుంచి ఓటు హక్కును వినియోగించుకునే వరకు వివిధ దశల్లో చేయాల్సిన విధి విధానాలపై సమగ్ర సమాచారం అందజేశారు. సువిధ పోర్టల్‌పై పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. రాజకీయ పార్టీలు, పోటీలో ఉండే అభ్యర్థులు ముందస్తుగా సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోర్టల్‌లో నేరుగా దరఖాస్తు చేసుకున్న వాటిని ఆర్‌ఒలు సాధ్యమైనంత తొందరగా సహేతుకమైన విధానంలో అనుమతులు జారీ చేస్తారని చెప్పారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఆన్‌లైన్‌ నేరుగా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉందని పేర్కొన్నారు. తాత్కాలిక పార్టీ కార్యాలయాన్ని తెరవడానికి, సభ నిర్వహించడానికి అనుమతి కోసం దరఖాస్తు, లౌడ్‌ స్పీకర్‌ లేకుండా సభ నిర్వహించడానికి, లౌడ్‌ స్పీకర్‌ ఏర్పాటు చేయడం కోసం, స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌, లౌడ్‌ స్పీకర్‌ కోసం, ఇంటింటికీ ప్రచారం కాన్వాసింగ్‌ కోసం, కరపత్రాల పంపిణీ కోసం, ఊరేగింపు కోసం అనుమతి కోసం, ర్యాలీ కోసం లౌడ్‌ స్పీకర్‌, బ్యానర్‌, జెండాలను ప్రదర్శించడానికి దరఖాస్తు, ఎయిర్‌ బెలూన్‌ల కోసం పర్మిషన్‌ టైప్‌ అప్లికేషన్‌ని ఎంచుకోవాలన్నారు. హెలికాప్టర్‌, హెలిప్యాడ్‌ కోసం, వాహన అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్‌ ఆర్‌ఒ, జెసి ఎన్‌.తేజ్‌భరత్‌, అర్బన్‌ ఆర్‌ఒ, మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌, కొవ్వూరు ఆర్‌ఒ, సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ్‌, సహాయం కలెక్టర్‌ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, డిఆర్‌ఒ జి.నరసింహులు, రాజానగరం ఆర్‌ఒ, ఆర్‌డిఒ ఎ.చైత్ర వర్షిణి, గోపాలపురం ఆర్‌ఒ, ఒఎన్‌జిసి ఎస్‌డిసి కెఎల్‌.శివజ్యోతి, నిడదవోలు ఆర్‌ఒ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఆర్‌వి.రమణా నాయక్‌, అనపర్తి ఆర్‌ఒ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం.మాధురి, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి ముత్యాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️