ఎంపీ అభ్యర్థులపై ముమ్మర కసరత్తు!

సిఎం జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరుతున్న రావెల కిషోర్‌బాబు దంపతులు
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక వైసిపి చేస్తున్న కసరత్తు కొలిక్కి వస్తోంది. వైసిపి అధిష్టానం బుధవారం రాత్రి తాడేపల్లి నుంచి విడుదల చేసిన జాబితాలో నర్సరావుపేట లోక్‌సభ అభ్యర్థిగా నెల్లూరు ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ పేరును ఖరారు చేశారు. బిసి సామాజిక తరగతికి చెందిన అనిల్‌కుమార్‌ను ఎంపిక చేయడం ద్వారా పల్నాడు జిల్లాలో వైసిపికి ఉన్న పట్టును మరింత పెంచుకునేందుకు అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయులు వైసిపి నుంచి తప్పుకున్న తరువాత పలువురి పేర్లు తెరపైకి వచ్చినా చివరికి బీసీలకు ఇవ్వాలని సిఎం జగన్‌ గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ వైపు మొగ్గు చూపారు. మరోవైపు మాజీమంత్రి రావెల కిషోర్‌బాబు బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా వైసిపిలో చేరారు. బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి నందిగం సురేష్‌ను కాకుండా రావెల సతీమణి శాంతిజ్యోతిని అభ్యర్థిగా ఎంపిక చేయనున్నట్టు తెలిసింది. గుంటూరు లోక్‌సభ నుంచి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకట రమణకు అవకాశం ఇస్తారని ప్రచారమవుతోంది. అయితే తమ వద్ద ఆర్ధిక స్థోమత లేదని వారు వెనుకంజ వేయడంతో తాజా జాబితాలో వెంకటరమణ పేరు రాలేదని వైసిపి వర్గాలు తెలిపాయి. వెంకట రమణ పోటీకి ముందుకు రాకపోతే గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడికు అవకాశం ఇస్తారని తెలిసింది. మంచివాగ్దాటి కలిగిన మనోహర్‌… పవన్‌ కల్యాణ్‌పై తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జగన్‌ సోదరి షర్మిలపైనా ఆయన బుధవారం ఘాటువిమర్శలుచేశారు. కాపులకు అవకాశం ఇవ్వాలని భావిస్తే మనోహర్‌నాయుడు వైపు వైసిపి అధిష్టానం మొగ్గుచూపవచ్చు. మరోవైపు టిడిపిలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ఇంతవరకు కొలిక్కిరాలేదు. తాజాగా గుంటూరు ఎంపి గల్లా జయదేవ్‌ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో భాష్యం రామకృష్ణ, పెమ్మసాని చంద్రశేఖర్‌ పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. వైసిపికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయులు టిడిపిలో చేరతారని ప్రచారమవుతున్నా ఇంకా ఖరారు కాలేదు. ఆయన టిడిపిలో చేరిన తరువాత గురటూరు లేదా నర్సరావుపేటలో పోటీ చేయించే విషయంలో నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన వైసిపికి రాజీనామా చేసి వారందాటినా ఇంతవరకు ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. జనసేన నుంచి క్రికెటర్‌ అంబటి రాయుడు పేరు విన్పిస్తున్నా జనసేనకు జిల్లాలో లోక్‌సభ సీట్లు ఇచ్చే అవకాశం లేదంటున్నారు. వైసిపి రెండు ఎంపి స్థానాల్లో సోషల్‌ ఇంజినీరింగ్‌ పాటిస్తుండటంతో టిడిపి కూడా పునరాలోచనలో పడ్డట్టు తెలిసింది.

➡️