ఉపాధ్యాయ నియామకాలకు కేబినెట్‌ గ్రీన్‌ సిగల్‌

ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి

712 ఖాళీలతో డిఎస్‌సి?

  • నోటిఫికేషన్‌ విడుదలకు సన్నాహాలు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్‌సి (జిల్లా సెలక్షన్‌ కమిటీ) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో బుధవారం సమావేశమైన కేబినెట్‌ ఇందుకు ఆమోదం తెలిపింది. త్వరలో నోటిఫికేషన్‌ వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. జిల్లాకు సంబంధించి 712 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. రెండు నెలల కిందటే జిల్లాలో ఖాళీల వివరాలతో అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిసింది. రేషనలైజేషన్‌ తర్వాత ఏర్పడిన ఖాళీలు, పలు కారణాలతో ఏర్పడిన ఖాళీలను పాఠశాల విద్యాశాఖ పరిగణనలోకి తీసుకుని నోటిఫికేషన్‌లో పొందుపరిచినట్లు తెలిసింది. కొద్దిరోజుల్లో డిఎస్‌సి షెడ్యూల్‌ను ప్రకటించనుంది.జిల్లాలో ఉన్న 712 ఖాళీల్లో ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్‌ పాఠశాలల్లో 527 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. అందులో ఎస్‌జిటి 341 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 106, భాషా పండితులు 42 మంది, సంగీతం టీచర్‌ పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. శ్రీకాకుళం కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీల్లో 65 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎస్‌జిటి 47 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 13, భాషా పండితులు నాలుగు, పిఇటి ఒక పోస్టు ఖాళీ ఉంది. జిల్లాలో ఏజెన్సీ ఏరియా పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన నడుస్తున్న పాఠశాలల్లో 35 ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. వాటిలో ఎస్‌జిటిలు 24, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు మూడు, భాషా పండితులు ఆరు, పిఇటి రెండు పోస్టులు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఏజెన్సీయేతర ప్రాంతాల్లోని పాఠశాలల్లో 85 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎస్‌జిటి పోస్టులు 39, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 11, భాషా పండితులు 23, పిఇటి 12 ఖాళీలు ఉన్నట్లు సమాచారం టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్‌ను నిర్ణయించనున్నారు. దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తే పరీక్షల నిర్వహణకే పది రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. టెట్‌తో పాటే డిఎస్‌సి దరఖాస్తులను స్వీకరిస్తారా?, మరో తేదీ నిర్ణయిస్తారా? అన్నది చూడాల్సి ఉంది. టెట్‌, డిఎస్‌సి రెండింటికీ దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యే నాటికి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దీనిపై ప్రభుత్వం ఏవిధంగా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది.

➡️