ఉన్నత చదువుల్లో స్ఫూర్తికావాలి

Dec 20,2023 20:20

  ప్రజాశక్తి-విజయనగరం :  విదేశీ విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్ధులకు ఆర్థిక సహాయం విడుదల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో విజయం సాధించి అఖిల భారత సర్వీసుల్లో చేరాలనే ఉద్దేశంతోనే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులకు ఆర్ధిక సహాయం అందజేస్తున్నట్టు చెప్పారు. ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణత సాధించి మెయిన్‌కు అర్హత సాధించిన వారికి రూ.1 లక్ష, మెయిన్‌ పరీక్ష ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకు వెళ్లేవారికి రూ.50 వేలు ఆర్ధిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.జగనన్న విదేశీ విద్యాదీవెన కింద జిల్లాలోని ఆరుగురు విద్యార్ధుల విదేశీ విద్యకోసం రూ.64.54 లక్షలు, సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ ఉత్తీర్ణులై మెయిన్‌ పరీక్షకు హాజరవుతున్న ఆరుగురు అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ.1 లక్ష వంతున రూ.6 లక్షలు విడుదల చేశారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న అనంతరం జెడ్‌పి ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, డిసిసిబి ఛైర్మన్‌ వేచలపు చినరామునాయుడు, డిసిఎంఎస్‌ ఛైర్మన్‌ అవనాపు భావన, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి బి.రామానందం, గిరిజన సంక్షేమ అధికారి చంద్రశేఖర్‌, బి.సి.సంక్షేమ సహాయ అధికారి యశోదనరావు తదితరులు పాల్గొన్నారు.ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సిఎం ధ్యేయంపేద విద్యార్ధులు ఉన్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి విదేశీ విద్యాదీవెన పథకాన్ని చేపట్టారని జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఒక్కో విద్యార్ధి చదువుపై రూ.90 లక్షల వరకు ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్య కలలను సాకారం చేస్తోందన్నారు.

➡️