ఉనికి కోల్పోతున్న ‘ధర్మవరం’ చేనేత

హ్యాండ్‌లూమ్‌ చేనేత మగ్గం

       అనంతపురం ప్రతినిధి : ధర్మవరం అంటేనే గుర్తుకొచ్చేది చేనేత. శిల్క్‌ సిటీగా పిలుచుకునే ఈ ప్రాంతం దాని అస్తిత్వాన్ని క్రమంగా కోల్పోతోంది. చేనేత మగ్గాలు క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి. వాటి స్థానంలో మరమగ్గాలు విస్తరిస్తున్నాయి. చాలా ఎళ్లుగా చేనేత స్థానంలో మరమగ్గాలు తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతూ వచ్చినప్పటికీ స్థానిక నేత కార్మికులు పోరాటం చేసి వాటిని అడుగు పెట్టకుండా నిరోధిస్తూ వచ్చారు. అయితే ఈ ఐదేళ్ల కాలంలో ఈ ప్రాంతంలోకి మరమగ్గాలు చాపకింద నీరులా విస్తరించిపోయాయి. దీంతో క్రమంగా చేతి మగ్గాలు కనుమరగువుతూ వస్తున్నాయి. ధర్మవరం అంటేనే హ్యాండ్‌లూమ్‌ కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు 30 వేలకుపైగా ఇక్కడ చేతి మగ్గాలు ఉండేవి. ఇప్పుడు ఐదు వేలలోపునకే వచ్చేశాయి. అదే పరిస్థితిల్లో 12 వేల వరకు మరమగ్గాలు ధర్మవరంలో ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తోంది. చేనేత వస్త్రాలను మరమగ్గాలపై నేయకూడదని 11 రకాల రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బుట్టదాఖలవుతోంది. యధేచ్ఛగా చేనేత రిజర్వేషన్‌ చట్టం ఉల్లంఘన జరుగుతోంది. పవర్‌లూమ్స్‌లో హ్యాండ్‌లూమ్‌ రకాలను నేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ధర్మవరంల చేనేత వృత్తి పూర్తిగా లేకుండాపోతుందనే ఆందోళన కార్మికుల్లో వ్యక్తం అవుతోంది. మరోవైపు చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంతో ముడిపట్టు ధరలు కూడా పెరిగాయి. ఎన్నికలకు ముందు చేనేతలకు అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. కాని ఆచరణలో ఆదుకున్న చర్యలేవీ ఉండటం లేదు. నేతన్న నేస్తం పేరుతో ఏడాదికి రూ.24 వేలు ఇవ్వడంతోనే సరిపెడుతున్నారు. అంతకు మునుపున్న చేనేత రాయితీ లేదు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం కూడా పూర్తి స్థాయిలో అందడంలేదు.

సిబిఆర్‌ నిర్వాసితులకు అందని పూర్తి స్థాయి పరిహారం

            ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ని పూర్తి స్థాయి సామర్థ్యంతో నింపారు. ఈ సమయంలో మరిమేకలపల్లి గ్రామం పరిధిలో నిర్వాసితులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఆ గ్రామంలో నిర్వాసితులుగానున్న ఎస్సీలకు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా పరహారం అందలేదు. దాని కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇక ముదిగుబ్బలో నిర్మిస్తున్న జిల్లేడుబండ నిర్వాసితులు కూడా పరిహారం కోసం ఎదురు చూసే పరిస్థితులున్నాయి.

పశువుల కాపురులకు తప్పని కష్టాలు

       ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో పశువుల పెంపకం, గొర్రెల పెంపకందారులు అధికంగా ఉన్నారు. పెంపకందారుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. సరైన బీమా సౌకర్యం లేదు. మందులు సకాలంలో అందించే పరిస్థితుల్లేవు. ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇవ్వడం తరువాత మర్చిపోవడం పరిపాటిగా మారిదంటూ ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులోనూ సమస్యలపై స్పందించేలా నాయకుల కార్యచరణ ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

➡️