ఉద్రిక్తత

Jan 3,2024 21:45 #ఉద్రిక్తత

ప్రజాశక్తి-కడప అర్బన్‌ గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలని మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న ఆందోళన బుధవారం ఉద్రిక్తతకు దారి తీసింది. నగరంలోని పాత మున్సిపల్‌ కార్యాలయం వద్దకు తెల్లవారుజామునే భగత్‌సింగ్‌నగర్‌కు వెళ్లే క్లాప్‌ ఆటోలను కార్మికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు మున్సిపల్‌ కార్మిక సంఘం నాయకులు సుంకర రవి, జయసింహ, నరసింహులను అరెస్టు చేశారు. మరో వైపు కార్పొరేషన్‌ ఎదుట నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా కార్మికులు పొర్లు దండాలు పెడుతూ తమ నిరసన తెలియజేశారు. ఆనందరావు అధ్యక్షతన చేపట్టిన కార్యక్రమంలో సిఐటియు నగర సహాయ కార్యదర్శి ఇత్తడి ప్రకాష్‌ మాట్లాడుతూ సమ్మె మొదలై 9 రోజుల అవుతున్నా ఈ ప్రభుత్వనికి కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. ఇంతవరకు ఈ ఉద్యమం శాంతియుతంగా చేశామని, అధికారుల చర్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని తెలిపారు. నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కంచుపాటి శ్రీరామ్‌ మాట్లాడుతూ డిమాండ్‌ పరిష్కరించే వరకు పోరాటం ఆగదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కంచిపాటి తిరుపాల్‌, గోపి, కిరణ్‌, శ్రీధర్‌ బాబు, నాగరాజు, ఆదాము, వై.రమేష్‌ సి. కొండయ్య, దస్తగిరమ్మ, కొండమ్మ, ధరణి వాటర్‌ సెక్షన్‌ కార్మికులు, ఎలక్ట్రిసిటీ, ఇంజినీరింగ్‌ కార్మికులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహించడం వల్లే సమ్మె దీర్ఘకాలంగా కొనసాగుతోందని మున్సిపల్‌ కార్మికులు అన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు చేస్తున్న సమ్మె బుధవారానికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. జగనన్న ఇచ్చి హామీలు ‘గోవిందా గోవిందా’ అని పంగనామాలతో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు విజయకుమార్‌, కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) కోశాధికారి రాఘవేంద్ర, సహాయ కార్యదర్శులు రవికుమార్‌, మోహన్‌, ఉపాధ్యక్షులు గుర్రమ్మ రమాదేవి ప్రమీలమ్మపాల్గొన్నారు. బద్వేలు : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 9వ రోజు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద బుధవారం బద్వేల్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి జగనన్న కార్మికులకు ఇచ్చిన హామీలు గోవిందా.. గోవిందా అంటూ పంగనామాలతో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమ్మె, ఆందోళనలు దీర్ఘ కాలం కొనసాగటానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, న్యాయ సమ్మతమైన సమస్యలను అంగీకరించి సమ్మెకు ముగింపు పలకాలని కార్మికులు, ప్రజలు కోరుకుంటున్నా, ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మౌనం వీడి, ప్రత్యక్షంగా జోక్యం చేసుకోని కార్మిక డిమాండ్లను అంగీకరించి సమ్మె పరిష్కరించాలని లేనిపక్షంలో కార్మికులు చేస్తున్న సమ్మె, ఆందోళనలకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు మద్దతు పలకాలని, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. నిరసన కార్యక్రమంలో యూనియన్‌ పట్టణ అధ్యక్షుడు పులి శ్యాం ప్రవీణ్‌, కార్యనిర్వాహక అధ్యక్షులు దియ్యాల హరి, ఉపాధ్యక్షులు దియ్యాల దేవమ్మ, గంటా శ్రీనివాసులు, కోశాధికారి కాలువ శివకుమార్‌, ప్రధాన కార్యదర్శి దియ్యాల నాగేంద్రబాబు, కార్యదర్శులు నాగరపు సత్యరాజు, బద్వేల్‌ ప్రవీణ్‌ కుమార్‌, నేలటూరు పాలయ్య, కమిటీ సభ్యులు పద్మిశెట్టి రామయ్య,తేళ్ల కిరణ్‌, ఇండ్ల చంద్రశేఖర్‌, పాతర పెంచల వరప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️