ఉద్యోగులకు ఆర్థిక బకాయిలు చెల్లించాలి

ప్రజాశక్తి – పాలకొల్లు

ఉద్యోగుల ఆర్థిక బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్యోగుల జెఎసి సభ్యులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. పాలకొల్లు జెఎసి ఛైర్మన్‌ గుడాల హరిబాబు అధ్యక్షతన వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ జిపిఎఫ్‌, ఎపి జిఎల్‌ఐ, సరెండర్‌ లీవ్స్‌, డిఎ ఎరియర్స్‌, 11వ పిఆర్‌సికి సంబంధించి ఏరియర్స్‌ బకాయిలు నగదు రూపంలో చెల్లించేందుకు కాలయాపన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందన్నారు. ఈ నిరసన కార్యక్రమాలు 20వ తేదీ వరకూ జరుగుతాయని, 27న చలో విజయవాడ జరగనుందని చెప్పారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ నేత లక్ష్మీనారాయణ, జెఎసి కార్యదర్శి మురళీకృష్ణ, మున్సిపల్‌ సంఘం కార్యదర్శి ముచ్చర్ల రామకృష్ణ ప్రసాద్‌, ఎపిటిఎఫ్‌ నేత రాంబాబు పాల్గొన్నారు.నరసాపురం: ఉపాధ్యాయ, ఉద్యోగలకు బకాయిలు చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని జెఎసి ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. మండలంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ మేరకు భోజన విరామ సమయంలో ఎన్‌సిసి కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. అలాగే ఎల్‌బి.చర్ల పిహెచ్‌సి వద్ద వైైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ నెల 17న సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద సుమారు 100 మందితో నిరసన తెలియజేస్తామని జెఎసి అధ్యక్షుడు మామిళ్ల రామ సుబ్బారావు తెలిపారు.తణుకు రూరల్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎపిటిఎఫ్‌ రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఐ.రాజగోపాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తణుకు నం.3 పాఠశాల వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొగల్తూరు:తమ సమస్యలు పరిష్కరించాలని మండలంలో ఉపాధ్యాయులు శుక్రవారం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యమ కార్యాచరణ విజయవంతం చేశారని జెఎసి నాయకులు చింతపల్లి కృష్ణ మోహన్‌ సూచించారు.

➡️